రాజీనామాకు ముఖ్యమంత్రి సిద్ధం ?

cm kiranబహుశా ఈ వారం పదిరోజుల్లోపే రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి, శాసన సభ్వత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినపడుతున్న వార్త. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సన్నిహితులే ఈ వార్తను బలపరుస్తున్నారు. తెలంగాణా విషయంలో అధిష్టానం వైఖరి పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారనేది నిస్సందేహం. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో అధిష్టానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి తో బాటుపి సి సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ లు తెలంగాణా పై రూట్ మ్యాప్ ను సమర్పించారు. ఇందులో దామోదర తెలంగాణా ను పూర్తిగా సమర్ధిస్తూ తన నివేదిక సమర్పించగా, బొత్స మాత్రం చాలా బ్యాలెన్స్ తో, తటస్థంగా తన నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం రాష్ట్రం విడిపోతే ఎదురయ్యే నష్టాలను వివరిస్తూ సమైక్యంగా ఉంచటమే ఉత్తమమంటూ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా అధిష్టానానికి నివేదించారు.నివేదించటమే కాకుండా ఇదే అభిప్రాయాన్ని దాదాపు కాంగ్రెస్ అగ్రనేతలందరినీ వ్యక్తిగతంగా కలిసి మరీ తన వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేసారు.

కానీ అధిష్టానం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపినట్లు స్పష్టం కావటంతో ముఖ్యమంత్రి నిస్సహాయ పరిస్థితిలో డిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు. దాదాపు అప్పటినుంచీ కిరణ్ కుమార్ చాలా సైలెంట్ గా వుంటున్నారు. కొద్ది రోజుల క్రితం సీమ, ఆంద్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు ఆయనను కలిసి సమైక్యాంధ్ర కు అనుకూలంగా రాజీనామాలు చేయబోతున్నట్టుగా అల్టిమేటం ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పెద్దగా స్పందించలేదు. ఎవరెన్ని రాజీనామాలు చేసినా, ఎంత ఆందోళనలు చేసినా అధిష్టానం తెలంగాణా ఇచ్చేందుకు నూటికి నోరు పాళ్ళు సిద్ధమైందని తనకు ముందుగానే తెలిసి ఉండటమే ముఖ్యమంత్రి మౌనానికి కారణమని తెలుస్తోంది. పైగా రాష్ట్ర విభజన అనివార్యమని, అందరూ అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందేనని ఆయన తన తన సన్నిహిత మిత్రులతో చెప్పినట్టుగా కూడా సమాచారం.

రాష్ట్ర ముఖ్యమంత్రి గా తానిచ్చిన నివేదికలను పట్టించుకోక పోవటమే కాకుండా తన వాదనను కూడా అధిష్టానం పెడ చెవిని పెట్టడాన్ని కిరణ్ కుమార్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాకుండా, ముఖ్యమంత్రి పదవికి కూడా అవమానంగా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. విభజన అనివార్యమైతే రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఆయన పలు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదని ఆయన భావనగా తెలుస్తోంది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వటం వల్ల సిమంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. అయితే తన వాదన అరణ్యరోదన గా మారటంతో ఆయన మౌనాన్ని ఆశ్రయించాల్సివస్తోంది.

ఇదే కాకుండా ఆయనకు సన్నిహితమిత్రుడైన మంత్రి టి జి వెంకటేష్ లాంటి వారు కూడా ముఖ్యమంత్రి రాజీనామా చేయక తప్పదని, ఆయన ఏ రోజైనా తన పదవిని వదులుకొవచ్చని బహిరంగంగానే చెబుతున్నారు. కాగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, కొంతకాలం వేచి చూడమనీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి ని అనునయించినట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో గత నెలరోజులుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది….. పధకాలు అటకెక్కాయి…. వరదల్లాంటి విపత్తులు, తద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా ముఖ్యమంత్రి పట్టించుకునే పరిస్థితి లేకపోవటం దయనీయం.

ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఎప్పుడు రాజీనామా చేస్తారా? కనీసం ఈ కొద్దిమాసాలైనా ఆ కుర్చీలో కూర్చునే చాన్స్ తమకు దక్కుతుందేమో ? అని ఆశగా ఎదురుచూసే వారు కాంగ్రెస్ పార్టీలో సహజంగానే చాలామంది వున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గా నాలుగవ కృష్ణుడుగా ఎవరు ఆవిర్భావిస్తారా అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల ముందున్న ప్రశ్న.