“సారు కేసీయారు జన సంక్షేమమే మీ పేరు” పాటను ఆవిష్కరించిన మంత్రి తలసాని..


తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ – వర్కర్స్ ఫెడరేషన్ వారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 16న ఘనంగా నిర్వహించారు. యూసఫ్ గూడ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను టెలివిజన్ ఫెడరేషన్ లోని అన్ని విభాగాల వారు కలిసి సమన్వయంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. “తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ – వర్కర్స్ ఫెడరేషన్ వారు మన సీఎం కేసీఆర్ గారి బర్త్ డే ను ఇంత గ్రాండ్ గా నిర్వహించడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేస్తూ రాసిన పాట చాలా బాగుంది. రచయిత వెనిగళ్ళ రాంబాబు గారికి, సంగీత దర్శకులు ఖుద్దూస్ గారికి, గాయకుడు ధనుంజయ్ గారికి అభినందనలు. పాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను చాలా బాగా హైలెట్ చేశారు. ఈరోజు టీవీ సీరియల్స్ చూడని ఇల్లాలు లేదు. ఈరోజు టెలివిజన్ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుగు భాషలోనే అధిక సంఖ్యలో సీరియల్స్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీవీ రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వారిలో అర్హులైన వారందరికీ ఆరోగ్య శ్రీ, కళ్యాణ లక్ష్మి పథకాలన్నీ ఏర్పాటు చేస్తాం. టీవీ ఫెడరేషన్ వారు ప్రభుత్వాన్ని టీవీ నగర్, టీవీ భవన్ కావాలని కోరుతున్నారు. అవి ఇచ్చే సందర్భం కూడా త్వరలోనే వస్తుంది. ప్రభుత్వం టీవీ రంగానికి సంపూర్ణంగా అండగా ఉంటుంది” అన్నారు.

ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పై, ప్రభుత్వ పథకాలపై రూపొందించిన పాటల బిగ్ సీడీని సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు. అంతేకాదు “సారు.. కేసీయారు.. జన సంక్షేమమే మీ పేరు..”పాట రాసిన వెనిగళ్ళ రాంబాబు, సంగీతం సమకూర్చిన ఖుద్దూస్, కొరియోగ్రాఫర్స్ రమేష్, సత్య మాస్టర్ లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శాలువతో సత్కరించారు.

ఇక తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు కే రాకేష్ మాట్లాడుతూ.. “టీవీ నగర్ ఏర్పాటుకి ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది. ఖచ్చితంగా టీవీ నగర్ సాధించి తీరుతాం. టీవీ కార్మికుల, కళాకారుల కల త్వరలోనే నెరవేరుతుంది. ఐకమత్యంమే మన విజయానికి కారణం అవుతుంది” అన్నారు.