తెలంగాణ లో ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను భక్తుల దగ్గరకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. తపాల శాఖ ద్వారా ఇంటికే దేవుళ్ళ ప్రసాదాలు, మొబైల్ యాప్ ద్వారా పూజ సేవలను శనివారం అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలోని 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్‌లో రాష్ట్రంలో ఎక్కడికైనా పంపే విధంగా పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చకున్నామన్నారు.
ప్రసాదం హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు నేరుగా ఏ పోస్ట్ ఆపీసుకైనా వెళ్లి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పోస్ట్ ఆఫీసులో భక్తులు తమకు నచ్చిన గుడిలో ప్రసాదాలకు రుసుం చెల్లిస్తే, వారి పేరిట ప్రసాదాలను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారని పేర్కొన్నారు. ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో భక్తుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తారని వివరించారు. దేశ వ్యాప్తంగా 1.60 లక్షల పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ సేవలను పొందవచ్చన్నారు. దీంతో పాటు ఆలయ పూజ సేవల బుకింగ్ లను కూడా తపాల శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నామన్నారు.మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో పూజ సేవలను బుక్ చేసుకోలేని వారికోసం పోస్ట్ ఆఫీసులో ఆఫ్ లైన్ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.