తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడిలో చేయడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ రాష్ట్రంలోని విపక్షాలన్నీ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించాయి. మధ్యాహ్నం విపక్ష నేతలంతా ప్రగతి భవన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో ముందస్తుగా మోహరించిన పోలీసులు ఆందోళనకు దిగిన విపక్ష నేతలను అరెస్టు చేశారు. ప్రగతి భవన్‌కు పీపీఈ కిట్‌తో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే వివిధ పార్టీల ముఖ్య నేతల ఇళ్లను దిగ్బంధనం చేశారు. ప్రగతిభవన్ ముందు పోలీసులు భారీగా మొహరించారు.
అలాగే సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డిని సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఇంకా ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.