తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు , మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో వ్యక్తి కరోనా తో మరణించడం తో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 15 కు చేరుకుంది. వికారాబాద్ పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు (65) ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డాడు. శుక్రవారం (ఏప్రిల్ 10) అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీకి తరలించే సమయానికే అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మరణించాడు.
అలాగే వికారాబాద్ జిల్లాలో ఆదివారం ఒక్క రోజే 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఇద్దరు వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో శనివారం రాత్రికి కరోనా కేసులు 500 దాటగా.. ఈరోజు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.