తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతుండగా..నిన్నటి వరకు ఖమ్మం లో ఒక్క కరోనా కేసు కూడా లేదని నగర వాసులు , అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఈరోజు తొలి కరోనా కేసు బయటపడి అందరికి షాక్ ఇచ్చింది. సోమవారం (ఏప్రిల్ 6) విడుదల చేసిన బులెటిన్‌లో ఆ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వెల్లడైంది.
ఖమ్మం జిల్లా పెద్దతండాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడు కూడా ఢిల్లీలోని మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అతడిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలేవీ అతడికి లేవని తెలిపారు. బాధితుడు టీబీ పేషెంట్ కావడంతో వైద్యులు అప్రమత్తంగా ఉండి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.