తెలంగాణలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర సరిహద్దులను పోలీసులు మూసివేసి, ఇతర రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు. (కోదాడ) రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న తెలంగాణ చెక్ పోస్ట్ ను మూసివేయడంతో ఏపీ నుంచి వచ్చే వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారే కాకుండా రాష్ట్రంలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేవారు కూడా పాస్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ పోలీస్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in లో దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లోనే అనుమతులు జారీ చేస్తారు.
హైదరాబాద్ లో మొత్తం 276 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180, సైబరాబాద్- 50, రాచకొండ పరిధిలో 46 ఏర్పాటు చేశారు. అత్యవసర విధులు, ఆస్పత్రులకు వెళ్లేవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు.