తెలంగాణలో అధికారం ఎవరిది..?


తెలంగాణలో పాలిటిక్స్ ఊపుమీదున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతి విమర్శలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు. కేంద్ర బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలకు దిగారు. తెలంగాణ రాజకీయల్లో నువ్వానేనా అన్నట్లు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సమస్యలతో పాటు అభివృద్దిపై బీఆర్ఎస్ ఫోకస్ పెడితే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ, కాంగ్రెస్ నజర్ పెట్టాయి.

తెలంగాణలో రాజకీయం రంజుమీద ఉంది. ఒక వైపు బీఆర్ఎస్ నేషనల్ పార్టీగా మారినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్దం చేసుకుంది. మరో వైపు బీజేపీ అధిష్టానం తెలంగాణ స్టేట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఫైర్ అయ్యారు.

కానీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. వీళ్లను ప్రజలు నమ్మితే నిలువునా ముంచేస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన పాలన చేస్తున్నాయంటూ హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.