తెలంగాణ లో భూముల డిజిటల్ సర్వేను చేపట్టడానికి ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులను ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. డిజిటల్ సర్వే ప్రక్రియ విషయమై సీఎస్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్లో వివిధ కంపెనీలతో సమావేశాన్ని నిర్వహించారు. భూముల డిజిటల్ సర్వే జరిపేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన 17 కంపెనీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఇతర రాష్ట్రాలలో నిర్వహించిన భూముల డిజిటల్ సర్వే సందర్భంగా తాము ఎదుర్కొన్న సమస్యలు, అనుభవాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయా కంపెనీలు వివరించాయి.
ఈ అంశంపై సీఎం శ్రీ కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, అయ్యే వ్యయం, సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, ఇంటర్నెట్ సామర్థ్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం కమీషనర్ మరియు ఐ.జి. శేషాద్రి, టి.ఎస్.టి.ఎస్. ఎండి వెంకటేశ్వర్ రావు, సర్వే, సెటిల్మెంట్ & ల్యాండ్ రికార్డ్సు కమీషనర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.