ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకొని తొమ్మిదో ఏట అడుగు పెడుతుతోంది. గురువారం రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్‌ ముస్తాబైంది. కరోనా వల్ల రెండేళ్ల పాటు ఈ వేడుకలు తక్కువ మంది అతిథులతో ప్రగతి భవన్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సారి ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో పబ్లిక్‌గార్డెన్‌లో ఏర్పాట్లను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. గురువారం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అంతకు ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో పోలీస్‌ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. పతాకావిష్కరణ అనంతరం కేసీఆర్‌ ప్రసంగిస్తారు.

సాయంత్రం రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మంత్రులు కూడా జిల్లాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఢిల్లీలో రాష్ట్రావతరణ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనుంది. ఉత్సవాలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.