కరోనా నిబంధనల నడుమ బోనాల పండుగ

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభ‌వంగా నిర్వ‌హించేలా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌ముద్ అలీ అధికారుల‌ను ఆదేశించారు. బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్, హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ సంబంధిత అధికారులతో అర‌ణ్య భ‌వ‌న్ లో స‌మీక్ష నిర్వ‌హించారు.

బోనాల‌కు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు.ఆల‌యాల వ‌ద్ద‌ క్యూలైన్లు, నీటి సౌకర్యం క‌ల్పించాల‌న్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి దర్శనాలు చేసుకోవాలని కోరారు. ఆల‌యాల వ‌ద్ద కూడా మాస్కుల‌ను, శానిటైజ‌ర్ల్ ఉండేలా చూడాల‌ని తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ముఖ్య‌మంత్రి 15 కోట్ల రూపాయలు మంజూరు చేశార‌ని ఆ నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకుని బోనాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌న్నారు.