ఫిబ్రవరి14న పార్లమెంటులో టీ. బిల్లు !

telangana bill in parlimentపార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లును తీసుకువచ్చేందుక రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 5నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో ఫిబ్రవరి 14ను టీ బిల్లుకు ముహుర్తంగా నిర్ణయించినట్లు ఓ కధనం. ఏపి పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుండటంతో మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. గడువు ముగిసిన తర్వాత మరో రెండ్రోజుల పాటు అసెంబ్లీలో వెల్లడైన అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్రపతికి బిల్లును పంపాల్సి ఉంటుంది. చర్చపై గడువును మరోమారు పొడిగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా అందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

బిల్లులో దాదాపు ఆరు సవరణ ప్రతిపాదనలకు జిఓఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇఛ్చే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి మూడు నుంచి వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణ బిల్లుపై జిఓఎం రోజువారీ సమావేశాలను నిర్వహించనుంది. ఫిబ్రవరి 14న హోంమంత్రి షిండే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు హోంమంత్రి షిండే., గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ల మధ్య ప్రాథమిక చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10లోపు జిఓఎం తుది నివేదికను కేంద్ర క్యాబినెట్‌కు సమర్పించనుంది. ఆ తర్వాత తుది బిల్లు రాష్ట్రపతికి చేరుతుంది. అక్కడ్నుంచి హోంశాఖ ద్వారా లోక్‌సభకు చేరనుంది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సులతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రాయం, కొత్త రాజధాని నిర్మాణానికి తగిన ఆర్ధిక సాయం వంటి అంశాలను బిల్లులో పొందుపరిచే అవకాశాలున్నాయి.