Site icon TeluguMirchi.com

నేడు కేబినెట్ కు టీ-బిల్లు..??

t-bill4ఢిల్లీలో బుధవారం ముఖ్యమంత్రి మరియు సీమాంధ్ర నేతలు చేసిన దీక్ష కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ప్రభావాన్ని చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి దీక్షలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పాల్గొనడం అధిష్టానానికి మింగుడుపడలేదు. దీంతో.. వెంటనే జీవోఎం సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర మంత్రులను ఆహ్వానించి మీకేం కావాలి..?? అనే పాత ప్రశ్ననే మరోసారి కొత్తగా అడిగింది. దీనికి మంత్రులు కూడా పాత డిమాండ్లనే కొత్తగా జీవోఎం ముందుంచారు.

సీమాంధ్ర మంత్రులు చేసిన డిమాండ్లలో హైదరాబాద్ ను యూటీ చేయడం, భద్రాచలంలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం, రాయల తెలంగాణ, 10సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన ఇరు ప్రాంతాలకు పంచడం.. మొదలైనవి. అయితే, పై డిమాండ్లపై ఏ ఒక్కదానికి జీవోఎం సభ్యుల నుంచి సానుకూల స్పందన రానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు (గురువారం) సీమాంధ్ర మంత్రులతో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

జీవోఎం కసరత్తు ఇంకా కొద్దిగా మిగిలివుందని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. జీవోఎం ఆఖరి కసరత్తు, సీమాంధ్ర మంత్రుల బుజ్జగింపు.. తదితర పరిణామాలు నేడు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర కేబినేట్ ముందుకు టీ-బిల్లు రావడం కష్టంగానే కనిపిస్తుంది. మరోవైపు, కేబినేట్ ముందుకు టీ-బిల్లు టేబుల్ ఐటమ్ గా రావచ్చనే ప్రచారం జరుగుతోంది. మరీ.. ఈరోజు జరిగే కేబినేట్ ముందుకు టీ-బిల్లు వస్తుందా.. ? రాదా?? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Exit mobile version