తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా పలుచోట్ల భారీ వర్షాలతో పాటు వడగాళ్ల వాన కూడా పడుతుంది. అయితే మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకణ్ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.ఇవాళ, రేపు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం కూడా తడిసి ముద్దయింది. హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా వాతావరణం కూల్ గా ఉంది. దీంతో పాటు నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ భార్షం పడుతుంది. దీంతో రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇక తమిళనాడు నుంచి మధ్య ప్రదేశ్ వరకు గల ద్రోణీ ఇప్పుడు దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా మీదుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఇవాళ, రేపు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.