Site icon TeluguMirchi.com

ధూంధాం’గా ఆవిర్భావ సంబరాలు

t
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను భారీస్థాయిలో నిర్వహించేందుకు తెరాస ఏర్పాట్లుచేస్తోంది. ‘తెలంగాణ ధూంధాం’ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. దీనికి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులతోపాటు వెండితెర, బుల్లితెర కళాకారులూ హాజరుకానున్నారు. ఆదివారం రాత్రి ఎనిమిదిగంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజాల వద్ద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘తెలంగాణ సాంస్కృతిక సంబురాలు’ అన్న పేరు పెట్టారు. పార్టీలకు, వర్గాలకు అతీతంగా కళాకారులను ఆహ్వానించినట్లు కార్యక్రమ సమన్వయకర్త, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెరాస కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ కర్నె ప్రభాకర్‌లు శనివారమిక్కడ విలేకర్లకు తెలిపారు.

రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో ధూం ధాం కళాకారుల బృందంతో కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజాకళాకారులు గోరేటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోకతేజ, సుద్దాల భారతి, స్వర్ణ, కవి,గాయకులు దేశపతి శ్రీనివాస్, సినీకళాకారులు నితిన్, నిఖిల్, ఉదయభాను, చిత్రలేఖ, లావణ్య, ఝాన్సీ, బాబుమోహన్, సంపూర్ణేష్‌బాబు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, చక్రి, ఘంటాడి కృష్ణ, రమేశ్, చిన్నిచరణ్, మిమిక్రి ఆర్టిస్టు శ్రీనివాస్, దర్శకులు ఎన్.శంకర్, హరీశ్‌శంకర్, సంపత్‌నంది, సురేందర్‌రెడ్డి, వంశీపైడిపల్లి, సినీనిర్మాతలు దిల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, సానాయాదిరెడ్డి, శివకుమార్, విజయేందర్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.

Exit mobile version