Site icon TeluguMirchi.com

తెలంగాణాలో ‘దేశం’ తీరుమారదా..!

tdp-telangan-forum తెరాస నాయకుడు కెసిఆర్ ఉద్యమాన్ని తాత్కాలికంగా జమ్మిచెట్టుపై పాండవులు ఆయుధాలు దాచినట్లు దాచేసి, ఎన్నికల మార్గంలో పరుగు ప్రారంభించేసాడు. ఉద్యమ లక్ష్యాలు, పార్టీని నమ్ముకున్న వారు, సీనియర్లు ఇవ్వన్నీ పక్కన పెట్టి, ఎన్నికల్లో విజయం సాధించడం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు. నవ్వి పోదురుగాక, నాకేటి సిగ్గు…అన్నంతగా ఆయన తన వ్యవహార శైలిని మార్చుకున్నారు.

దీన్ని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే యుద్ధం అన్నాక యుద్ధంలాగే చేయాలి. వ్యాపారం అన్నాక వ్యాపారంలాగే సాగించాలి. మరి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ సరే, దాని తీరే వేరు. కెసిఆర్ గెల్చుకున్న బలం తమ వెనకే వుంటుందని ధీమా. కానీ తెలుగుదేశానికి ఏమయింది? ఎర్రబిల్లి, మోత్కుపల్లి నిత్యం పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం తప్ప వేరే వ్యవహారం ఏమన్నా వుందా? పోనీ నాయకులు తమంతట తాము ఏమీ చేయేలేరనుకుంటే, నాయకుడు చంద్రబాబుకు ఏమయింది? ఆయన మానాన ఆయన సమావేశాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు.

అక్కడ కెసిఆర్ చెలరేగిపోతున్నారు. నియోజకవర్గాలు రాసిచ్చేస్తున్నారు. మరి అలాంటపుడు తెలుుగదేశం పార్టీ కూడా తనకో వ్యూహం రచించుకోవాలి కదా? ఎదుటివాడి బలహీనతే మన బలం అన్నది యుద్ధతంత్రం. కెసిఆర్ ఉద్యమాన్ని, రాజకీయాలను తప్ప ప్రజలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ సంగతి ఆయనకూ తెలుసు. అందుకే ఇప్పుడు హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. ఇన్నాళ్లు లేనిది, సంక్షేమ పథకాలు వల్లె వేస్తున్నారు. అలాంటపుడు తెలుగుదేశం పార్టీ జనం సమస్యలపై దృష్టి సారించాలి కదా. నాయకులు, కార్యకర్తలు నిత్య ప్రకటనల కార్యక్రమంతో పాటు, నియోజకవర్గాల్లో, వివిధ ప్రాంతాల వారీగా సమస్యలును గుర్తించి, పోరాడితే కొంతయినా ఫలితం వుంటుంది కదా? అదే విధంగా ప్రాంతాల వారీగా బలాలను, బలహీనతలను గుర్తించి, పోయినవారి స్థానాలను భర్తీ చేసుకునే ప్రయత్నాలు చేయాలి కదా.

కానీ చీమా..చీమా..ఎందుకు కుట్టావు అన్న చందంగా..వీళ్లు చేయలేదని వాళ్లు, వాళ్లు చెప్పలేదని వీళ్లు, ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ, కాలం నెట్టేస్తున్నారు. అధినేత కూడా మరెందుకో పెద్దగా ఇటువైపు చూస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలా ఎవరికివారు కూర్చుంటే పుణ్యకాలం దగ్గరైపోయి, పుట్టి మునిగిపోయే ప్రమాదం వుంది.

Exit mobile version