తెదేపా సంతకాల సేకరణ..!

tdp-Signature-Collection-onవిద్యుత్ సమస్యలపై తెదేపా పోరును ఉదృతం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఒక్కరోజు దీక్ష ముగిసిన అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ..  సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద నేతలు ఈరోజు (మంగళవారం) సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆరోపించారు. 2004 లో మంచి పనితీరుకుగాను ఏపీ ట్రాన్స్ కో అవార్డు అందుకుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ వ్యవస్థ అందరికీ ఆదర్శంగా నిలిచిందని సోమిరెడ్డి అన్నారు. రాష్ర్టంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రజాభిప్రాయం సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. రెండు కోట్లుకుపైగా సంతకాలతో గవర్నర్ కు, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెదేపా నేతలు తెలియజేశారు.