కామ్రేడ్స్ లేచారు.. తమ్ముళ్లు కూర్చున్నారు !

tdp-deeksha-on-power-cutవిద్యుత్ సంక్షోభం, కరెంట్ బిల్లుల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతలు నిరవధిక దీక్షకు దిగారు. ఆ పార్టీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎంపీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ లో దీక్ష చేపట్టారు. అసెంబ్లీ వాయిదా అనంతరం టిడిపి ఎమ్మెల్యేల బృందం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వరకు పాదయాత్ర చేపట్టి.. ఇదే ఆవరణలో దీక్షకు దిగారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయాలని, ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మరోవైపు విద్యుత్ సమస్యలపై గత అయిదురోజులుగా ఇందిరా పార్క్ వద్ద వామపక్షాలు చేస్తున్న దీక్షకు పోలీసులు అర్థరాత్రి భంగం కలిగించారు. వామపక్ష నాయకుల ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో.. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో దీక్ష కొనసాగించిన రాఘవులు, నారాయణ సహా ఏడుగురు వామపక్ష నేతలు అయిదురోజులుగా కొనసాస్తున్న దీక్షను ఈరోజు ఉదయం విరమించారు. ప్రభుత్వ వాణిజ్య విధానానికి స్వస్తి పలకాలని, విద్యుత్ ఉత్పత్తిలో జెన్ కోకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.

కాగా, విద్యుత్ సమస్యలపై అయిదురోజుగా నిరాహార దీక్ష చేసిన వామపక్ష నేతలు దీక్ష విరమించిన నేపథ్యంలో.. టీడీపీ అదే సమస్యపై దీక్ష చేపట్టడాన్ని వామపక్ష నాయకులు అభినందిస్తున్నారు. విద్యుత్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం అవుతున్నప్పటికిని, నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికిని ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.