Site icon TeluguMirchi.com

మైకు తెగింది… వేషం అదిరింది!

Presentation2రాష్ట్ర విభజన అంశం ఈ రోజు లోక్ సభను కుదిపేసింది. సమైక్య నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. సభ ప్రారంభమైన వెంటనే..తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో సభ సజావుగా సాగే అవకాశం కనిపించ లేదు. దీంతో సమైక్య నినాదాలతో సభకు అడ్డుతగులుతున్న పదకొండు మంది ఎంపీల సస్పెన్షన్ కు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్ర సభ్యులు వెల్ లోకి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో స్పీకర్ తీర్మానానికి ఓటింగ్ జరిపేందుకు సిద్ధమయ్యారు. అది గమనించిన సభ్యలు వెంటనే పోడియం వద్దకు వెళ్లిన మైక్ లు లాగేశారు. దాంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో స్పీకర్ మీరా కుమార్ అలానే చూస్తూ వుండి పోయారు.

మరో వైపు లోక్‑సభ నుంచి సస్పెండ్ అయిన చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్నంగా తన నిరసన తెలిపారు. కొద్ది రోజుల క్రితం కృష్ణుడి వేషధారణతో లోక్సభకు హాజరయిన శివప్రసాద్ ఈ రోజు తెలంగాణ సంప్రదాయ పండగల్లో పోతురాజు వేషధారి ధరించే చెర్నాకోలను పట్టుకుని, తనను తాను హింసించుకొని నిరసన తెలిపారు. దీంతో సభ మొత్తం అవాక్కయింది. శివప్రసాద్ కొట్టుకోవడాన్ని చూసిన స్పీకర్ కూడా అలానే చూస్తూ వుండి పోయారు. పార్లమెంటు వాయిదా పడిన అనంతరం మీడియా ముందు కూడా పార్లమెంటు సన్నివేశాన్ని ప్రదర్శించారు శివప్రసాద్. మొత్తానికి ఈ రోజంతా సమైక్య తాకిడి తో లోక్ సభ దద్దరిల్లిందనే చెప్పాలి.

Exit mobile version