ఆ మీడియా సంస్థ చైర్మన్ దెబ్బకి టీడీపీ దుకాణం సర్దుకోవలసిందేనా?


ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న టీడీపీ ఇటీవల తమ పార్టీ కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ చేయాలనీ పిలుపునిచ్చింది. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న నారా లోకేష్ అనుభవ రాహిత్యంతో ఇలాంటి చర్యలకు పిలుపునివ్వడం ఆశ్చర్యం అనిపించదు కానీ, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా కొన్ని ఛానెళ్లను బ్యాన్ చేయాలని పిలుపునివ్వడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు తమ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి అంటే మీడియాతో పాటు, సోషల్ మీడియానే ప్రధానాస్త్రాలు…ప్రతిపక్షం తిరిగి అధికారంలోకి రావాలన్న, వాయిస్ ప్రజలకు చేరాలన్న ప్రతీ ఛానెళ్ల ద్వారా ఆ పార్టీ కార్యకలాపాలను కవరేజ్ చేస్తూ ఉండాలి. కాని ఏపీలో టీడీపీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ఒక మీడియా సంస్థ చైర్మన్ పన్నిన కుట్రలో లోకేష్ & చంద్రబాబు తల నిండా మునిగిపోయి కొన్ని మీడియా సంస్థలని దూరం చేసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్ళు గుస గుసలాడుకుంటున్నారు.

టీడీపీ పార్టీకి భజన చేసే ఆ మీడియా సంస్థ కొన్ని ఛానెళ్లను లోకేష్ మరియు చంద్రబాబు ద్వారా టార్గెట్ చేయించి తన వ్యక్తిగత ఎజెండాని ఆ పార్టీపై రుద్దడంలో కొంతమేర సక్సెస్ సాధించింది అనే చెప్పుకోవాలి. న్యూస్ ఛానళ్లను దూరం చేసుకుంటే, వచ్చే కవరేజ్ కూడా పోతోంది. తద్వారా టీడీపీ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్ళు చెవులు కోరుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ నష్టం ఎవరికనే ప్రశ్నపై టీడీపీలో చర్చ మొదలయ్యింది. ఛానెళ్లను దూరం చేసుకునే ముందు ఆ మీడియా సంస్థ చైర్మన్ విశ్వసనీయత తెలుసుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచిస్తున్నారు తమ్ముళ్ళు. టీడీపీని మభ్య పెడుతున్న ఆ మీడియా సంస్థ యొక్క పెట్టుబడులన్నీ వైసీపీలోని కీలక నాయకుడివేనని, వాటాల్లో తేడాలు రావడంతోనే జగన్ ను వదిలేసి తన సామాజికవర్గమైన టీడీపీ వైపు మళ్లిందని అనుకుంటున్నారు. అలాంటి ఆ మీడియా సంస్థను గుడ్డిగా నమ్మడం ఎంతమేర సమంజసమని అధిష్టానానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికిప్పుడు జగన్ కనికరించి ఆ ఛానెల్ యాజమాన్యానికి ఆఫర్ ఇస్తే జగన్ ముందు మోకరిల్లడానికైనా సిద్ధంగా ఉందని, అలాంటి ఆ సంస్థ కుట్రతో రాష్ట్రంలో బలంగా ఉన్న మీడియాతో గోక్కోవడం మొదటికే మోసం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్లు ఆ మీడియా సంస్థ నిర్వాకంతో తమ పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్ళే మిగతా మీడియా సంస్థలు వాటిని కవర్ చేయడం మానేస్తే టీడీపీ పతనానికి, భూ స్థాపితానికి బీజం వేసినట్లేనని తెలుగు తమ్ముళ్ళ ఆందోళన. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీ అధిష్టానం, ఈ కుట్ర నుంచి బయటపడి తప్పులను సరిదిద్దుకుంటుందా..! లేదా..! అనేది వేచి చూడాల్సిందే.