అఖిలపక్షాన్ని బహిష్కరించిన టీడీపీ

TDP-boycott-all-party-meetiవివాదస్పద బాబ్లీ ప్రాజెక్టు అంశంపై అఖిలపక్ష భేటీని టీడీపీ బహిష్కరించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేకుండా అఖిలపక్షం నిర్వహించడంపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ర్ట ప్రయోజనాలతో ముడిపడిన ప్రధానమైన బాబ్లీ అంశం మంత్రి స్థాయిలో తేలేది కాదని టీడీపీ పేర్కొంది. సీఎం ఉన్నప్పుడే అఖిలపక్షం ఏర్పాటు చేస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందని టీడీపీ నాయకులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. బాబ్లీ అంశాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుందని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. అయితే గత నెలలో బాబ్లీ విషయంలో.. సుప్రీంకోర్టు మహారాష్ర్ట ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాబ్లీ అంశంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల ఒత్తిడికి నాలుగు రోజుల క్రితం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తీరా ఈ రోజు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సీఎం అందుబాటులో లేకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.