Site icon TeluguMirchi.com

ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం

tdp-formation-day-celebratiనట సార్వభౌమ దివంగత ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశంపార్టీ స్థాపించి 32 సంత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా.. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ర్టవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెదేపా రాష్ర్టపార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ. పెద్దిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ఏకచత్రాధిపత్యానికి స్వస్తి పలికి, ఆంధ్రపదేశ్ ప్రజలకు సుస్థిర పరిపాలన పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని ఆయన అన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన మహానుభావుడు ఎన్టీఆర్, గ్రామపంచాయితీల ఏర్పాటుతో పాటుగా, ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చే విధంగా రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో తెలుగుదేశం బీదవాడి పార్టీగా అవతరించిందని పెద్దిరెడ్డి తెలిపారు. పార్టీ ఆవిర్భవించిన తరవాత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో లేకుండా జరిగిన మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం ఇదే కావడం విశేషం.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో “వస్తున్నా.. మీకోసం“ పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పెదపూడిలో పార్టీ శ్రేణులతో కలిసి “పార్టీ ఆవిర్భావ దినోత్సవ” సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాబు వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కాగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.

Exit mobile version