టీ-నేతల పట్టు… సీమాంద్రుల బెట్టు !

ministersరాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఇరు ప్రాంతాల వారి సమస్యలను, సందేహాలను వినడానికి ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి ఇటు తెలంగాణ నేతలు విభజన వైపు అడుగేయండని చెబితే.. వెంటనే అటు సీమాంధ్ర నేతలు ఆపేయండని ఆదేశిస్తున్నారు. ఇరు ప్రాంతాల నేతలు ఒకరి ప్రాంతం తరవాత మరొక ప్రాంతం వారు ఆంటోని కమిటీని కలిసి తమ తమ వాదనను వినిపిస్తున్నారు.

ఆంటోని కమిటీతో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో.. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని యథాతథంగా అమలు పరచాలని, వెంటనే ప్రక్రియను వేగవంతం చేయాలని టీ-నేతలు డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ ను యూటీ చేయడంపై కమిటీ సభ్యులు ప్రశించగా, అలాంటి వాటిని అంగికరించబోమని టీ-నేతలు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కావాలంటే శాంతి భద్రతల అంశాన్ని కొంతకాలం కేంద్రం పరిధిలో ఉంచుకోవచ్చని సూచించారు. కాగా, తెలంగాణ ఏర్పాటుపై అధిష్టానం నిర్ణయం తీసుకున్నందుకు అధిష్టానానికి కృతజ్జతలు చెబుతూ నిన్నహైదరాబాద్ లో చేసిన ఏకగ్రీవ తీర్మాణాన్ని కమిటీ సభ్యలకు అందజేశారు.

టీ-నేతలు విభజన విషయంలో ముందుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంటే.. మరోవైపు సీమాంధ్ర నేతలు ముందుకెళ్లేతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరిస్తున్నారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ విభజన అనివార్యమని భావిస్తే.. హైదరాబాద్ ను యూటీ చేయాలని.. తద్వారా చెరో రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

ఈనెల 30లోపు ఏదో ఒకటి తేల్చి, రాష్ట్రంలో అనిశ్చితిని తొలగించాల్సిందిగా హైకమాండ్‌కు అల్టిమేటం ఇవ్వాలని సీమాంధ్ర నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఈరోజు (మంగళవారం) ఆంటోని కమిటీ ముందు మరోసారి గట్టిగా చెప్పేందుకు సీమాంధ్ర నేతలు సిద్ధమయినట్లు సమాచారం.