ముందు లోక్ సభలోనే.. !

lok-sabhaతెలంగాణ బిల్లును కేంద్రం మొదట లోక్ సభలోనే ప్రవేశపెట్టనుంది. మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాలని యోచించినా.. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం వున్నందున ఆ నిర్ణయాన్ని మానుకుంది. దీంతో.. టీ-బిల్లు మొదటగా లోక్ సభలోనికే రానుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదం కోసం కూడా బిల్లును రాష్ట్రపతి భవన్ కు పంపింది.

అయితే, బిల్లును ఎప్పుడు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారనే దానిపై ఇంకా స్పష్టతలేదు. ఈరోజు స్వీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో టీ-బిల్లుపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది. మరోవైపు, బిల్లుపై బీజేపీ మద్ధతును కూడగట్టే ప్రయత్నంలో తలమునకై వున్నారు కాంగ్రెస్ పెద్దలు.

ఇక బిల్లును ఎలాగైనా.. అడ్డుకోవాలనే ప్రయత్నాలలో సీమాంధ్ర నేతలు వున్నారు. ఇందుకు ఎంపీలతో పాటుగా, మంత్రులు కూడా రంగంలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీ-బిల్లుపై హస్తినాలో ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. ఏ క్షణంలోనైనా.. టీ-బిల్లును సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుండగా, ఎలాగైనా.. అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరో 48 గంటలో ఏపీ భవితవ్యంపై కాస్తయిన క్లారిటీ వచ్చే అవకాశం వున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.