జైలు పక్షులూ.. పోటీ చేయొచ్చు.. !

supremecourtజైల్లో ఉన్నా.. బరిలో దిగడానికి వున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అది కూడా పార్లమెంట్ సాక్షిగా. అదేనండీ దోషులుగా ఆరోపించబడి జైల్లోవున్న రాజకీయనాయకులకు ఎన్నికల్లో పోటీచేసే (ఆర్టికల్ 62 ఉపవిభాగం-2 సారాంశం) అర్హతలేదని దేశ అత్యున్నత న్యాయస్థానం జూలై 10 నాడు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా రెండు నెలలు కూడా గడవక ముందే… ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం (సవరణ, చెల్లుబాటు)-2013’ ద్వారా మన రాజకీయ నాయకులు ఆ సుప్రీం తీర్పుకు మంగళం పాడారు. న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ ప్రవేశపెట్టిన ప్రజా ప్రాతినిధ్య చట్టం నిన్న రాజ్యసభలో ఆమోదం పొందింది. దీంతో.. ఎంచక్కా.. జైలు నుంచే ఎన్నికల బరిలోదిగొచ్చు. తద్వారా గెలుపొందితే.. ఏ మంత్రిగానో.. ముఖ్యమంత్రి గానో, కేంద్రమంత్రిగానో బయటకు హుందాగా వెళ్లే వెసులు బాటును మన రాజకీయ నాయకులు సవరణ ద్వారా కల్పించుకున్నారు మరీ. అంతేకాకుండా.. రాజకీయనాయకులను దోషులుగా చిత్రీకరించడంలో కోర్టులు అత్యూహ్సాన్ని చూపిస్తాయని కూడా సిబల్ పేర్కొన్నారు. అంతేమరీ.. ఉత్సాహం చూపించక దండలేసి దండం పెట్టాలా అని సాధారణ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. రాజకీయ నాయకుల పవర్ తో.. న్యాయస్థానం కూడా చిన్నబోయే పరిస్థితి నెలకొన్నది అనడంలో అతిశయోక్తి లేదేమో.. !