బిజెపి ఎంపీ సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొనుంది.. ఆయన తండ్రి యలమంచిలి జనార్ధనరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించిన జనార్ధనరావు కోయంబత్తూరులోని పిఎస్జీ కాలేజి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. అనంతరం 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి, శ్రీరామ్ సాగర్, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలోనూ, వాటిని అమర్చడంలోను కీలకపాత్ర వహించారు.
ఈయన అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11.45 నిముషాలకు జూబిలీహిల్స్ విస్పర్ వ్యాలీలోని మహాప్రస్థానంలో జరుగుతాయని మీడియాకు సమాచారం అందించారు. గతంలో తెలుగుదేశం తరఫున కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన సుజనాచౌదరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బిజెపి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.