Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్న సోనూ..

అరుంధతి చిత్రంలో పశుపతి గా అందర్నీ మెప్పించిన సోనూసూద్‌..లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక అప్పటినుండి ప్రతి రోజు ఎవరు ఏ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈయన చేస్తున్న మంచి పనులకు ప్రతి ఒక్కరు అభిమానులు అవుతున్నారు. అలాంటి ఈ రియల్ హీరో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులు చేసిన పనికి సోనూసూద్ ఫిదా అయ్యారు. గిరిజనులు స్వచ్ఛందంగా చేపట్టిన రహదారి నిర్మాణంపై సోనూసూద్‌ అభినందనలు తెలిపారు. త్వరలోనే ఏపీలో పర్యటించి వారికి కలుసుకుంటానని వెల్లడించారు. ఈ మేరకు సోనూసూద్ సోమవారం ట్వీట్ చేశారు.

కొదమ పంచాయతీలో మొత్తం 150 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు నిత్యావసర వస్తువులు తీసుకెళ్లేందుకు, రోగులను ఆసుపత్రికి తరలించేందుకు సరైన రోడ్డు, రవాణా సౌకర్యం లేదు. ఏ చిన్న అవసరం వచ్చినా కొండలు, గుట్టల్లో కాలి నడకన వెళ్లాల్సిందే. నిత్యావసరాల కోసం ఒడిశా సరిహద్దులో 4 కిలో మీటర్ల దూరాన ఉన్న బారి గ్రామంలోని సంతకు కాలినడకనే వెళ్తుంటారు. ఈ క్రమంలో ఒక్కో ఇంటికి రూ. 2,000 చొప్పున చందాలు సేకరించి రెండు జేసీబీలను అద్దెకు తీసుకుని రెండు వారాల పాటు శ్రమించి కొండను తొలిచారు. మరో వారం రోజుల పాటు మట్టి వేసి 4 కిలో మీటర్ల మేర రహదారిని ఏర్పరుచుకున్నారు.

వీరి శ్రమపై మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఈ విషయానికి సంబంధించి ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు. దీన్ని చూసిన సోనూసూద్ కొదమ గ్రామ గిరిజనులను అభినందించారు. యావత్‌ దేశాన్ని మీ స్ఫూర్తి ప్రేరేపిస్తుందని కొనియాడారు. మీ ప్రేరణ దేశం మొత్తం అనుసరించాలని.. అందరం కలిసి కట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేద్దామంటూ సోనూసూద్‌ పిలుపునిచ్చారు. త్వరలో కొదమ గ్రామాన్ని సందర్శించనున్నట్లు ఆయన ప్రకటించారు.

Exit mobile version