Site icon TeluguMirchi.com

ముద్దాయికి ప్రోటోకాల్ ఇస్తారా?

అక్రమాస్తులు, ఓఎంసి ఎమ్మార్ కేసులు జగన్ చుట్టూ తిరిగాయని, అన్ని కేసుల్లో ముద్దాయి జగన్ కు గవర్నర్ ప్రోటోకాల్ ఇస్తారా? అని తెదేపా నేత సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడుతూ.. జగన్ కు ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగింపు చేస్తూ స్వాగతం పలికినప్పుడు సాక్షులకు భయం వేయదా? అని అన్నారు. అక్రమాలు జరిగాయని పలు రకాలుగా చెప్పిన సీబీఐ ఇప్పుడు 9 కంపెనీల్లో అవకతవకలు జరగలేదని ఎలా చెప్పిందని అడిగారు. సీబీఐ హడావుడిగా ఎందుకు మెమో ఫైల్ చేసిందని ప్రశ్నించారు. అసలు సీబీఐకి ఎవరు మెమో ఫైల్ చేయాలని సూచించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సీబీఐ కి మెమో నమోదు చేయాలని జడ్జి ఆదేశించారా? లేక కేంద్రం చెప్పిందా? తెలపాలన్నారు. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా నేరస్తులను రక్షించేందుకు ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం.. నేరస్తులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సోనియా కనుసన్నల్లో ఉండే కిరణ్ ప్రభుత్వం జగన్ విషయంలో సహకరించిన తీరే కాంగ్రెస్ వైఖరి తెలియజేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ మెమోను ఫైల్ చేసిన తీరు, జగన్ కు పోలీసులు స్వాగతం పలికిన తీరు దేశంలోని ఆర్థిక నేరాలకు కేస్ స్టడీగా ఉపయోగపడే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.

బెయిల్ వచ్చిన రోజు విజయమ్మ ఏఐసీసీ ప్రతినిధి చాకోకి థాంక్స్ ఎలా చెప్పిందో గుండెలమీద చెయ్యి వేసుకుని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాకో మాట్లాడుతూ జగన్ బయటున్నా లోపలున్నా కాంగ్రెస్ కు మద్దతివ్వడం తప్పదని చెప్పడం దేన్ని సూచిస్తుందని సోమిరెడ్డి అడిగారు. రాహుల్ గాంధీ చేతకానివాడు, అసమర్థుడు కావడంతో.. ప్రధాని పదవి తనవల్ల కాదని అతడే అంటున్నా, భయమేస్తుందని పారిపోయినా ప్రధానిని చేసేందుకు సోనియానే స్వయంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు.

రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తికి ఊరేగింపులు చేస్తే మిగిలిన వారు బెయిల్ కు ఎందుకు ప్రయత్నించరూ..? అని ప్రశ్నించారు. ప్రజాధనం వసూలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version