Site icon TeluguMirchi.com

సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రానికి “ఎన‌ర్జీ ఎఫిషియెన్సీ అవార్డు”

సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ  మంచిర్యాల జిల్లా జైపూర్ వ‌ద్ద నిర్వ‌హిస్తున్న సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు కు ఎంపికైంది. విద్యుత్ ఉత్ప‌త్తి  సంస్థ‌ల‌కు సంబంధించి  వివిధ అంశాల‌పై అధ్య‌య‌నం చేస్తూ ప్రోత్సాహ‌క అవార్డుల‌ను ప్ర‌క‌టించే కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్స‌లెన్స్ (ముంబ‌యి) సంస్థ వారు 2021 వ సంవ‌త్స‌రానికి “ఎన‌ర్జీ ఎఫిషియెన్సీ అవార్డును శుక్ర‌వారం( అక్టోబ‌రు 22వ తేదీన‌) జాతీయ స్థాయిలో నిర్వ‌హించిన వీడియో  కాన్ఫ‌రెన్స్ లో ప్ర‌క‌టించారు.

ద‌క్షిణ భార‌త  దేశంలో 500 మెగావాట్లు మ‌రియు ఆ పై స్థాయి ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం గ‌ల సుమారు వంద‌ ప్లాంట్ల విభాగంలో ఈ అత్యుత్త‌మ అవార్డును సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ కు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.  సాధార‌ణంగా 600 మెగావాట్ల సామ‌ర్థ్యం గ‌ల ప్లాంట్లు ఒక యూనిట్ విద్యుత్ ను ఉత్ప‌త్తి చేయ‌డానికి 2444 కిలో కాల‌రీల‌ శ‌క్తి ని ( బొగ్గును) వినియోగించ‌వ‌చ్చ‌ని ప్రామాణికంగా సూచిస్తుంటారు. కాగా, 1200 మెగావాట్ల సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో గ‌ల రెండు ప్లాంట్ల లో ఒక‌టో ప్లాంట్  ఒక  యూనిట్ విద్యుత్  కి ఉత్ప‌త్తి  నిర్దేశిత ప్ర‌మాణాల క‌న్నా త‌క్కువ‌గా  స‌గ‌టున 2425 కిలో కాల‌రీల శ‌క్తిని (బొగ్గును) మాత్ర‌మే వినియోగిస్తోంది. ఈ విధంగా అత్యంత స‌మ‌ర్థంగా బొగ్గును వినియోగిస్తున్నందుకు గుర్తింపుగా ఎన‌ర్జీ ఎఫిషియెన్సీ అవార్డును ప్ర‌క‌టిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. త‌క్కువ బొగ్గు తో త‌గిన ఉష్ణోగ్ర‌త‌ను సాధించడం , ప్లాంట్ అవ‌స‌రాలకు  విద్యుత్, ఆయిల్‌ వినియోగంలోనూ పొదుపు పాటించ‌డం తో ఈ అవార్డుకు ఎంపికైంది.

Exit mobile version