Site icon TeluguMirchi.com

సింగపూర్ మంత్రితో చంద్రబాబు బృందం

CM-in-a-meeting-with-financ
శిక్షణ, సామర్ధ్యం పెంపు, వ్యాపార సరళీకృత విధానం, ఆకర్షణీయ నగరాలు తదితర అంశాలలో కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల ప్రతినిధులు నిర్ణయించారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రెండోరోజు సోమవారం సింగపూర్ మంత్రి శ్రీ ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం తరువాత రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అమరావతి నగర నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం అందించిన మాస్టర్ ప్లాన్‌పై తదుపరి ఏంచేయాలన్న విషయంపై సమాలోచన చేశారు. అమరావతి నగర నిర్మాణాన్ని చేపట్టే మాస్టర్ డెవలపర్ ఎంపిక విషయంలో అనుసరించాల్సిన పద్దతులపై కూలంకషంగా చర్చించారు. మాస్టర్ ప్లాన్, ఇతర విషయాలలో సింగపూర్ ప్రభుత్వం అందించిన సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ మరచిపోలేరని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని సింగపూర్ మంత్రి శ్రీ ఈశ్వరన్‌ను కోరారు.

ఈ పర్యటనలో తాను మంగళవారం సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లీ సీన్ లూంగ్‌ని కలుస్తున్నానని, ఇటీవల జరిగిన సింగపూర్ ఎన్నికలలో ఘన విజయం సాధించినందుకు అభినందించడంతో పాటు ఆయన్ని రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించనున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు బృందానికి సింగపూర్ మంత్రి శ్రీ ఈశ్వరన్ మధ్యాహ్నం విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి బృందం సింగపూర్ దేశానికి చెందిన పలువురు ఆర్థికవేత్తలు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. తరువాత సింగపూర్ మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలో ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, సుస్థిరమైన నాయకత్వం, స్పష్టమైన ప్రణాళికతో దూసుకుపోతోందని వివరించారు. ఏపీలో వున్న సహజ వనరులు, ఇతర మౌలిక సదుపాయాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి అదనపు ఆకర్షణలని చెప్పారు.

తమ ప్రభుత్వం ఈ మధ్యనే గోదావరి, కృష్ణానదులను అనుసంధానం చేయడం ద్వారా కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రానున్నకాలంలో లాజిస్టిక్ హబ్‌గా అవతరించనున్నదని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు శ్రీ టక్కర్, శ్రీ సతీశ్ చందర్, శ్రీ అజయ్ జైన్, సీఆర్డీఏ అధికారి శ్రీ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Exit mobile version