Site icon TeluguMirchi.com

జనవరి 2నుంచి సీమాంధ్ర బంద్!!

Seemandra bandhసమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేసేందుకు ఏపీ ఎన్జీవోలు రెడీ  అయ్యారు. అయితే, ఈసారి రాజకీయ పార్టీలతో కలసి పవర్ ఫుల్ పోరాటాన్ని శ్రీకారం చుట్టారు. జనవరి 3వ తేది నుంచి రెండో దఫా శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో టీ-బిల్లుపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో.. జనవరి 2నుంచి ఏపీ ఎన్జీవోలు కార్యాచరణను రూపొందించారు. ఈ మేరకు ఈరోజు(శనివారం) ఏపీ ఎన్జీవో భవన్ లో జరిగిన అఖిలపక్ష భేటీ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.

ఏపీ ఎన్జీవోల తాజా కార్యాచరణ ప్రకారం..  జనవరి 2 నుంచి 10 వరకు సీమాంధ్రలో బంద్ లు జరుగుతాయి. జనవరి 3 తేదిన రాష్ట్ర బంద్.  4న
జిల్లాల్లో సమైక్య మానవహారాలు, 5న ఉపాధ్యాయుల ర్యాలీలు. వీటితో పాటుగా.. విద్యార్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరూ.. రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు.. తదితర మార్గాల ద్వారా నిరసన తెలియజేసేలా కార్యాచరణను రూపొందించారు ఏపీ ఎన్జీవోలు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అశోక్ బాబు తెలిపారు.

ఏపీ ఎన్జీవోలు సీమాంధ్ర బంద్ కు పిలుపునివ్వడం సాధారణమే అయినా.. జనవరి 3న రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. రాష్ట్ర బంద్ అంటే.. రాష్ట్రం మొత్తం బంద్ పాటించాల్సి వుంటుంది. మరీ.. సమైక్య కోసం చేసే బంద్ లో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకునే తెలంగాణ ప్రజలు ఎందుకు పాల్గొంటారు. మొత్తానికి.. గతకొన్ని రోజులుగా కాస్త ప్రశాంతంగా వున్న రాష్ట్రం మరోసారి రావణ కాష్టలా మారనుందన్న మాట.

Exit mobile version