జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా బల ప్రదర్శనకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ జె. సురేందర్ రెడ్డి గారు అన్నారు. రేపటి నుండి వారం వరకు జిల్లా కేంద్రం లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులు,గుంపులుగా ఎవరూ గుమిగుడవద్దని, జన జీవనానికి ఇబ్బంది కలిగించ వద్దని ఎస్పి గారు బుధవారం పత్రికా ప్రకటనలో కోరారు. శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లకు, బహిరంగ చర్చలకు పోలీసు శాఖ అనుమతి లేదని ఎస్పీ గారు స్పష్టం చేశారు. ముందస్తుగా రేపు భూపాల పల్లి పట్టణంలో 144 సెక్షన్ విధించడం జరిగిందని అనవసరంగా ఎవరూ బయటకి రాకూడదని పేర్కొన్నారు.
మంగళ వారం జరిగిన ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవలు, దాడుల విషయంలో రెండూ పార్టీల కార్యకర్తల మీద కేసులు నమోదు చేశామని, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా బహిరంగ ప్రదేశంలో చర్చలకు ఎవరికి ఎటువంటి అనుమతి లేదని ఎస్పి సురేందర్ రెడ్డి గారు తెలిపారు. జిల్లా కేంద్రానికి నలుమూలల నుంచి ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వస్తారని, ప్రజలకు ఇబ్బంది కలిగించ వద్దని రాజకీయ పార్టీలకి ఎస్పి గారు సూచించారు. రేపు నిర్వహించనున్న బహిరంగ చర్చ కార్యక్రమాన్ని విరమించుకోవాలని, ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదిలేది లేదని, చట్ట పరంగా తీవ్ర చర్యలు ఉంటాయని ఎస్పి సురేందర్ రెడ్డి గారు హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల శ్రేయస్సే పోలీసుల అభిమతమని ఎస్పి గారు పేర్కొన్నారు.