సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు ప్రారంభించనున్నందున ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, అన్ని విద్యా సంస్థలలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కోరారు.
మంగళవారం నాడు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయం నుండి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, ఇతర జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో విద్యాసంస్థల పునఃప్రారంభం, విద్యాసంస్థలలో పారిశుద్ధ్య పనులు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కారణంగా మూతపడిన విద్యాలయాలు తిరిగి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందువల్ల నిబంధనల మేరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వారు కోరారు.
రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులందరినీ కోవిడ్ నిబంధనల ప్రకారం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యాశాఖ అధికారులు ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడి సెంటర్లు, హాస్టల్స్ 30వ తేదీలోగా శానిటైజేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గ్రామస్థాయిలో గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వ పాఠశాలన్నింటిని శుభ్రంగా ఉంచే విధంగా బాధ్యత వహించాలని ఆయన కోరారు. ప్రభుత్వ విద్యాలయాల ప్రాంగణంలో ఉన్న తరగతి గదులను, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లను, ఫర్నిచర్ ను శుభ్రపరిచే విధంగా చర్యలు గైకొనాలని మంత్రి కోరారు. విద్యాసంస్థల పైనున్న నీటి ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని, విద్యాలయ ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించి ఏ విధమైన చెత్తాచెదారం లేకుండా చూడాలని, త్రాగునీటి వసతులైన నల్లాలనూ, ట్యాంకులను శుభ్రపరచాలి అని ఆయన కోరారు. మిషన్ భగీరథ అధికారులు ప్రతి విద్యా సంస్థను తప్పక సందర్శించి అన్ని విద్యా సంస్థలకు నీటి వసతి ఉండే విధంగా ఈనెల 30వ తేదీలోగా చేయాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యాలయాలు, అంగన్వాడీలు ప్రారంభం అయిన నాటి నుండి ప్రతిరోజూ శుభ్ర పరిచే విధంగా జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని జెడ్పీ చైర్మన్లు, సీఈవో లు జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతిరోజు పాఠశాలను సందర్శించి పాఠశాలలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో నిధులకు కొరత లేదని, అందువల్ల విద్యాలయాలు తప్పక శుభ్రం చేయాలని ఆయన కోరారు.
పాఠశాల పూర్వ విద్యార్థుల నుండి విరాళాలు స్వీకరించి పాఠశాలలో వైట్ వాషింగ్, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల పారిశుద్ధ్య పనుల నిర్వహణ పూర్తి బాధ్యత గ్రామపంచాయతీలదేయని ఆయన అన్నారు. పారిశుద్ద్యం నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన గ్రామ సర్పంచ్ ల పై, అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులతో సమన్వయం చేసుకొని విద్యార్థులకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు రాకుండా చూడాలని ఆయన కోరారు. పాఠశాల విద్యార్థులకు మాస్క్ లను ఏర్పాటు చేయాలని ఆయన గ్రామ సర్పంచ్ లను కోరారు.
ప్రభుత్వ విద్యాలయాలలో ప్రతి గదిని, ఫర్నిచర్ ను శుభ్ర పరుచుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. పాఠశాలలో గదులను, టాయిలెట్లను, కిచెన్ షెడ్డు లను ప్రత్యేకంగా శుభ్రపరచాలి అని ఆమె కోరారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కులు ధరించి పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఆమె కోరారు. ప్రైవేట్ విద్యాలయాలలో కూడా పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధముగా జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.
ఆగస్టు 30 లోగా అని విద్యాలయాలలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య చర్యలు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉండేటట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికేట్ ఇవ్వాలని ఆమె కోరారు. విద్యాలయాలు ప్రారంభం అయిన పిదప ప్రతిరోజు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపిడిఓలు, మండల విద్యాశాఖ అధికారులు విద్యాలయాలను సందర్శిస్తూ పారిశుద్ధ్య పనులను కొనసాగేలా చూడాలని ఆమె సూచించారు.
ఈనెల 26వ తేదీ నుండి ఉపాధ్యాయులందరూ ప్రతి రోజూ రెగ్యులర్ గా పాఠశాలలకు హాజరుకావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ సెక్రెటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.