గత దశాబ్దంలో మధ్యతరగతి భారతీయుల సగటు ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్టు తన నివేదికలో తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. రానున్న రెండున్నర దశాబ్దాల్లో మధ్యతరగతి సగటు ఆదాయం మరింత పెరుగుతుందని అంచనా. నివేదిక ప్రకారం, 2012-13 ఆర్థిక సంవత్సరంలో సగటు ఆదాయం రూ. 4.4 లక్షలుగా ఉంది. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 13 లక్షలకు పెరిగింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ పరంగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం పన్ను రిటర్న్ ఫైలింగ్‌లలో ఈ రాష్ట్రాలు 48 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల ఆధారంగా ‘ఎక్స్‌ప్లోరింగ్ న్యూ ట్రెండ్స్ ఇన్ ఐటీఆర్ ఫైలింగ్: గ్రోత్ ఆఫ్ ఎ న్యూ మిడిల్ క్లాస్’ అనే నివేదికను రూపొందించారు. ఇందులో, గత 10 సంవత్సరాలలో, దిగువ మధ్యతరగతి అధిక ఆదాయ వర్గానికి చేరుకోవడం గురించి వివరంగా వివరించబడింది.