నేడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ 146 వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. సర్దార్ పటేల్ జయంతి పురస్కరించుకొని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ జరుపుకుంటున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా దేశప్రజలను ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించడమే గాక, 560కి పైగా రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్ లో శాంతియుతంగా ఏకీకృతం చేసి, బృహత్తర విజయాలకు నాందిపలికారు. పౌరసేవలకు రూపకల్పన చేసి బలమైన పరిపాలనకు పునాది వేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని స్మరించుకుంటూ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా వారి ఉన్నత వ్యక్తిత్వం నుంచి స్ఫూర్తి పొంది దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను బలోపేతం చేస్తూ ఆకలి, అసమానతలు, పేదరికం, అవినీతిని నిర్మూలన దిశగా కంకణబద్ధులమౌదాం.