Site icon TeluguMirchi.com

టెన్నిస్‌కు గుడ్ బై చెప్పిన సానియా మీర్జా


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (36) టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే సోమవారం ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా మీర్జా పాల్గొంటోంది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. ఇక టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి కూడా వివరించింది.

కొడుకు బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఆటకు వీడ్కోలు పలకడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సానియా వివరించింది. రిటైర్మెంట్ నిర్ణయం చాలా కఠినమే అయినా ఏదో ఒక సమయంలో ఇది తీసుకోక తప్పదని పేర్కొంది. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. మరి కొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగే ఫిట్‌నెస్ తనకు ఉందని, అయితే కొడుకు ఇజాన్ బాధ్యతల నేపథ్యంలో టెన్నిస్ ఆడడం తనకు సాధ్యం కాదని వివరించింది.

ఇక సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నానని సానియా తెలిపింది. ఈ క్రమంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలను తాను చవిచూశానని తెలిపింది. అయితే ఆటలో ఇది ఒక భాగం అనే విషయాన్ని తాను మరచి పోలేదని చెప్పింది.

ఇక తాను టెన్నిస్‌లో ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రులేనని స్పష్టం చేసింది. తనను మెరుగైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు వారు పడిన శ్రమను మాటల్లో వర్ణించలేనని తెలిపింది. అంతేగాక తన ఎదుగుదలలో కోచ్‌లు, స్పాన్సర్లు, కుటుంబ సభ్యులు, మీడియా సహకారం కూడా ఎంతో ఉందని చెబుతూ వీరందరికి తాను సదా రుణపడి ఉంటానని సానియా పేర్కొంది.

భారత టెన్నిస్‌పై తెలుగుతేజం సానియా మీర్జా తనదైన ముద్ర వేసింది. తన అసాధారణ ఆటతో అంతర్జాతీయ టెన్నిస్‌లో భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది. అంతేగాక ఎంతో మంది టెన్నిస్ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది.

Exit mobile version