కార్యకర్తలని పార్టీకి దూరం చేస్తున్న సజ్జల రామకృష్ణ !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సలహాదారులపై ఇప్పటికే బోలెడు విమర్శలు వున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వివాదంలో ప్రభుత్వం పై మచ్చ తెచ్చేలా వ్యవహరించారు జగన్ ప్రధాన సలహాదారులు. ఎలాంటి అవగహన లేకుండా జగన్ మోహన్ రెడ్డి మెప్పుపొందాలనే తుత్తరపాటులో చేసిన పనులు జగన్ పై విమర్శలు తెచ్చేలా చేశాయి. ఈ విషయంలో ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, సలహాదారులని గట్టిగానే మందలించారు.

ఐతే ఇప్పుడు మరో వివాదం తెరపైకి తెచ్చారు…ప్రభుత్వ సలహాదారుగా ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ సలహాదారు గా ఉంటున్న ఆయన పార్టీలో రాజకీయ పెత్తనాలు కూడా చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు వున్నాయి. ఆయన రాజ్యాంగేత శక్తిగా మారి పార్టీలో ఆధిపత్య పోరుకు తెరలేపారని స్వయంగా పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ పై వచ్చిన ఓ వివాదం విషయంలో సజ్జల మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా ఆయన పార్టీ కార్యకర్తలని చాలా దారుణంగా కించపరుస్తూ మాట్లాడారు.

న్యాయవ్యవస్థపై కొంతమంది సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెట్టడం, వాటిపై కేసులు కూడా నమోదు కావడం తెలిసిందే. ఐతే ఈ పోస్టులు వైసిపీ కార్యకర్తలు పెట్టారని ఆరోపణ వుంది. దీనిపై విచారణ జరుగుతుంది. ఐతే దీనిపై మాట్లాడిన సజ్జల.. టోటల్ సోషల్ మీడియాని ఓ చెత్త కుండీ, బురదగుంట అని పోల్చారు. ఎవరో పనికిమాలిన వెధవలు చేసిన పని అని తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ పార్టీ కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీసినట్లుగా వుంది.

వైసిపీ విజయంలో సోషల్ మీడియాది కీలకపాత్ర. చాలా మంది కార్యకర్తలు జగన్ ఇమేజ్ ని సోషల్ మీడియాలో ఇనుమడింపచేశారు. విజయంలో సోషల్ మీడియా కూడా కీలక భూమిక పోషించింది. అలాంటి సోషల్ మీడియాని సజ్జల ఓ చెత్తకుప్పతో పోల్చడం సరికాదనే భావన పార్టీ నుండి వినిపిస్తుంది.

న్యాయవ్యవస్థ వివాదంలో వైసిపీ కార్యకార్తల మీద కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. ఎవరు తప్పు చేశారనే సంగతి ఇంకా ఖచ్చితంగా తేలాల్సివుంది. ఐతే ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియా, కార్యకర్తలు మాకు సంబంధం లేదన్నట్లు సజ్జల వ్యవహరించిన తీరు .. పార్టీ కోసం పని చేస్తున్న లక్షల మంది కార్యకర్తల ఆత్మస్త్యర్యాన్ని దెబ్బతీసేదిగా వుంది.

ఇలాంటి ”చెత్త” మాటలు కాకుండా.. ”మా కార్యకర్తలపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు.. క్రమ శిక్షణతో మెలిగే కార్యకర్తలు మాకున్నారు. విచారణ జరుగుతుంది. ఎవరు తప్పు చేసిన చట్టం ముందు సమానమే” అని సజ్జల వ్యాఖ్యానించివుంటే హుందాగా ఉండేది. కానీ మొత్తం ఇష్యూని సంబంధం లేదని వదిలేస్తే .. కార్యకర్తలు కూడా అలా పార్టీని వదిలేయడాని ఎక్కువ సమయం పట్టదు. అదే జరిగితే .. పార్టీకి తీవ్ర నష్టమని చెప్పకతప్పదు.