ఈరోజే సద్దుల బతుకమ్మ..

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఎలా జరుపుకుంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.

బతుకమ్మ పండుగలో ఆఖరి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విజయదశమి కంటే సద్దుల బతుకమ్మకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నిండు మనసారా గౌరమ్మను ఆరాధిస్తారు. మన సంస్కృతి ఉట్టిపడేలా పాటలు పాడుతూ సందడిగా మారనున్నాయి. ఈ బతుకమ్మ వేడుకలు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. తర్వాత ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మతో ఈ ఎనిమిది రోజులు వేడుకలు జరుగుతాయి.

సాయంత్రం ఆడబిడ్డలు చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కన మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ సందడిగా సాగనంపుతారు. ఇక తెలంగాణలోని ఊరు..వాడ తెలంగాణ పాటలతో మార్మోగుతుంది. ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుక జరగబోతుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబురాల్లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుక జరగనుంది. కరోనా నేపథ్యంలో సందడి తగ్గినా సద్దుల బతుకమ్మ వేడుకలకు మహిళలు సిద్ధమవుతున్నారు. శుక్రవారం పలు పట్టణాల్లో మహిళలు రంగురంగుల పూలు కొనుగోలు చేయడంతో సందడి నెలకొంది.