Site icon TeluguMirchi.com

అటవీశాఖ అధికారులని హెచ్చరించిన మంత్రి

రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీ శిద్దా రాఘవరావుగారు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును నిజమే! ఎప్పుడూ శాంతంగా ఉండే మంత్రి గారికి కోపం రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల జరిగిన ఐఏఎస్ ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు అటవీశాఖ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పట్ల అసంతృప్తిగా ఉన్న రాఘవరావుగారు ఈ విషయమై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు సూచనలిచ్చినా వారి పంథా మారకపోవడంతో మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పని తీరువల్ల తాను మాటలు పడాల్సివస్తుందని అధికారులపై సీరియస్ అయ్యారు. శాఖ పనులపై ఇప్పటికైనా వారి శైలి మార్చుకోకపోతే కఠిన చర్యలు చేపడుతామని అధికారులను హెచ్చరించారు. కొంతమంది అధికారుల వలన మొత్తం శాఖకే చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. ఇకపై ఇలాంటివి సహించబోమని హెచ్చరించారు.

అదే విధంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సమావేశంలో మంత్రి శిద్దా అధికారులకు సూచించారు. వచ్చే నవంబరు నాటికి రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరోమారు హెచ్చరించారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అటవీ సంపద అక్రమార్కుల పాలు కాకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఏదో ఒక మూల అక్రమ రవాణా జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. స్మగ్లర్లను పటిష్టంగా ఎదుర్కొనేందుకు అటవీ శాఖ అధికారులకు త్వరలోనే ఆయుధాలను సమాకూరుస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version