రాజీనామాలు..!

Seemandhra MLAs resignరాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనలు హోరెత్తాయి. ఎక్కడిక్కడ ప్రజాప్రతినిథుల ఇళ్ల ముట్టడి చేయడంతో పాటుగా రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో కలసిరావాలని ఆందోళనకారులు డిమాండ్ చేయడంతో వారిలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా పదవులను వదులుకోవాలని నలుగురు కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపీలు నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట దాకా సాగిన ఈ సమావేశంలో నలుగురు కేంద్ర మంత్రులు పళ్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, ఏడుగురు ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, హర్షకుమార్, సాయి ప్రతాప్, కేవీపీపాల్గొన్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం రాజీనామా చేయనున్నారు. అంతేకాకుండా మరో ముగ్గురు ఎంపీలు రాయపాటి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎస్పీవై రెడ్డి కూడా రాజీనామాలకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటును నిలువరించడం, సీమాంధ్రాకు న్యాయం చేయడం అన్న రెండు అంశాలపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా, తాను రాజీనామా చేసే సమస్యే లేదని అంతకుముందే తెలంగాణ నేతలకు తేల్చిచెప్పిన చిరంజీవితో పాటు మరో నలుగురు కేంద్ర మంత్రులు కావూరు సాంబశివరావు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, కిశోర్ చంద్రదేవ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. వీరు కూడా రాజీనామాలకు సుముఖంగా లేరని సమాచారం.

ముప్పై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.వీరిలో కొందరు పిసిసి అధ్యక్షుడికి,మరికొందరు స్పీకర్ ఆఫీస్ కు సమర్పించారు. వీరికి నచ్చచెప్పడానికి ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి అద్యక్షుడు బొత్సలు ప్రయత్నించినప్పటికినీ ఫలితం దక్కలేదు. గురువారం గంటా శ్రీనివాసరావు, కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, మహీధరరెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, గల్లా అరుణ కుమారి, శత్రుచర్ల లు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలలో కాటసాని రాంరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, శిల్పా మోహన్‌రెడ్డి, రాం భూపాల్‌రెడ్డి, ఉగ్ర నరిసింహరెడ్డి, మల్లాది విష్ణు, వెంపల్లి శ్రీనివాసరావు, శేషారెడ్డి, లబ్బి వెంకటస్వామి, ఉషారాణి, మురళి, ఆదినారాయణ, కె. నాగేశ్వరరావు, యలమంచిలి రవి, సుధాకర్, వెంకట్రామయ్య, కన్నబాబు, వంగాగీత, గాంధీమోహన్, షాజహాన్, జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు లు రాజీనామా చేసినవారిలో ఉన్నారు.
తమ ప్రాంత ప్రజల అభీష్టం మేరకే రాజీనామాలు చేస్తునట్లు వీరు ప్రకటించారు.