వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ… రుణగ్రహీతలపై భారం


ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్థిక నిపుణులు ముందుగా ఊహించినట్లుగానే వడ్డీ రేట్ల పెంపుదలకే గవర్నర్ మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆరోసారి రెపోరేటు 25 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. దీంతో రేపో రేటు 6.50కు చేరుకుంది. చివరిగా గత ఏడాది డిసెంబర్లో ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగగా ఆ సమయంలో 35 బేసిస్ పాయింట్లు పెంచారు. ద్రవ్యోల్బణం కట్టడి కోసం గత మే నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ పాలసీ రేట్లను 250 బేసిస్ పాయింట్లను పెంచింది.

కాగా, అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ బ్యాంక్ ఇటీవ‌ల త‌మ కీల‌క వ‌డ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది కూడా ఆర్బీఐ తాజా వ‌డ్డింపుల‌కు కార‌ణ‌మేన‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు క‌రోనాతో దెబ్బ‌తిన్న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా రెపోరేటును త‌గ్గిస్తూపోయిన ఆర్బీఐ.. గ‌త ఏడాది మే నుంచి మితిమీరిన‌ ద్ర‌వ్యోల్బ‌ణం అదుపే ల‌క్ష్యంగా పెంచుతూ వ‌స్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే 4 శాతంగా ఉన్న రెపోరేటు ఇప్పుడు 6.5 శాతానికి వ‌చ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు కూడా దాదాపు అన్ని రకాల లోన్లపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. దీంతో కస్టమర్లపై అదనపు భారం పడనుంది. మరోవైపు ఇదే సమయంలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరగనున్నాయి.