రాయల ’టీ’ రెడీ!

rayalatelanganaపది జిల్లాలతో కూడిన ’తెలంగాణ’నా.. 12జిల్లాలతో కూడిన ’రాయల తెలంగాణ’ అన్న అంశానికి తెరపడినట్లు తెలుస్తోంది. రాయల ’టీ’నే రెడీ చేస్తూ.. జీవోఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విసృత చర్చల అనంతరం రాయల ’టీ’నే అన్ని సమస్యలకు పరిష్కారంగా జీవోఎం నిర్థారణకు వచ్చింది. దీనికి అధినేత్రి సోనియా గాంధీ అనుమతి కూడా లభించినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణకు తెలంగాణతో పాటుగా, రాయల సీమలోని 2 జిల్లాల నుంచి కూడా విస్తృత ఏకాభిప్రాయం కుదిరినట్లు హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.

రాయలసీమలోని రెండు జిల్లాలను కలిపినప్పటికినీ.. నూతనంగా ఏర్పడబోయే రాష్ట్రానికి ’తెలంగాణ’ అనే పేరునే ఖరారు చేయనున్నారు. రాయల తెలంగాణను ఏర్పటు చేయడం ద్వారా.. నూతనంగా రూపుదిద్దుకోనున్న రెండు రాష్ట్రాలకు ఆర్టికల్ 371ఢి అధికరణానికి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా.. కొత్తగా ఏర్పడబోయే రెండు రాష్ట్రాలో సమాన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు వుంటాయి.

విభజనపై ఏర్పడిన జీవోఎం రాయల ’టీ’ని రెడీ చేసినప్పటికినీ వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలో టీ-బిల్లు రావడం అనుమానంగా వుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం పంచిపెట్టిన అజెండాలో టీ-బిల్లు లేదు. అయితే, జనవరిలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి టీ-బిల్లు ను ఆమోదించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. రాయల ’టీ’ని, భాజపా, తెరాసలతో పాటుగా తెదేపా తెలంగాణ ఫోరం సైతం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. టీ-బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.