Site icon TeluguMirchi.com

టీడీపీ, వైసీపీలది ఒకే తరహా దోపిడీ విధానం – జనసేన


• బయట తిట్టుకుంటారు… వెనక కలిసే ఇసుక, మట్టి మాఫియాలు సాగిస్తారు
• స్మశానాలు కూడా మిగల్చకుండా కబ్జాలు చేసేస్తున్నారు
• జనం మీదపడి బతికే చీడ పురుగుల్లా తయారయ్యారు
• జగన్ కు అన్నీ భయాలే… ఇక ఆయనేం చేస్తారు?
• టీడీపీ పాలన అంతమొందించి జనసేన ప్రభుత్వం స్థాపిద్దాం
• ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు వచ్చింది జనసేన
• రావులపాలెం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

ప్రజల సమస్యపైనా, పాలకుల అవినీతిపైనా శాసనసభలో నిలదీయడానికి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారు… ఎందుకంటే తమ అవినీతిని బయటపెడతారని ఆయన భయం అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. ప్రజలను దోచుకోవడంలో తెలుగుదేశం, వైసీపీలు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి అన్నారు. ప్రజల ముందు బయటకు వచ్చి తిట్టుకునే ఈ పార్టీలు వెనక మాత్రం కలిసే అవినీతి చేసి, దోచేస్తున్నాయి అన్నారు. ఇసుక, మట్టి మాఫియాలు కలిసే సాగిస్తున్నారు అని చెప్పారు. వీళ్ళ దోపిడీ- ఇసుక, మట్టి మాఫియాల నుంచి స్మశానాలను కూడా మిగల్చకుండా కబ్జా చేసే స్థాయికి వెళ్లిపోయింది అన్నారు. ఆదివారం రాత్రి రావులపాలెంలో ప్రజా పోరాట యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రస్తుతం జనం మీద బతికే నాయకులు కాదు…. జనం కోసం బతికే నాయకులు కావాలి. తొలినాళ్లలో జనం క్షేమం గురించి ఆలోచించిన నాయకులున్నారు. ఇప్పటి నాయకులు జనం మీదపడి బతికే చీడ పురుగుల్లా తయారయ్యారు. ప్రజల కన్నీళ్లు తుడిచి, వారి కష్టాలను తీర్చే లక్ష్యంతో జనసేన వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా మాకు రోడ్డు కావాలి, వైద్యం అందించండి అని ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరగడం ఏమిటి? ప్రజలకు అవసరమైన కనీస సదుపాయలు కల్పించడం వారి బాధ్యత కాదా? ఇప్పటికీ ఈ కోనసీమ ప్రాంతంలో పలు ఊళ్లలో చిన్నపాటి వంతెన కోసం ప్రజలు ఆందోళన చేయాల్సి వస్తోంది. ఇక్కడ పార్టీలు వేరైనా అధికార, ప్రతిపక్షాలు కలిసే దందాలు నడిపిస్తున్నాయి.

• ప్రతిపక్ష నేత హోదాకే భంగం

వీళ్ళు కలిసే అవినీతి చేస్తున్నారు కాబట్టి పాలకుల అవినీతిని అడిగే ధైర్యం జగన్ కు లేకుండాపోయింది. ఈ అవినీతిపై నిలదీస్తే ‘మీవాళ్ళు డబ్బులు తీసుకోలేదా’ అని ఎక్కడ టిడిపి అడుగుతుందో అని భయం. జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటంతో ప్రతిపక్ష నేత హోదాకే భంగం కలుగుతోంది. నేనేగానీ జగన్ స్థానంలో ఉంటే నా వెంట ఉన్న ఎమ్మెల్యేలు అమ్ముడుపోయి వెళ్లిపోయినా ఒక్కడినే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై నిలదీసేవాడిని. జగన్ కి తెలంగాణలో తిరగాలి అంటే భయం… చంద్రబాబు అంటే భయం, మోడీ అంటే భయం. ఇన్ని భయాలు ఉన్న జగన్ ఏం చేయగలరు? ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకూ ఎటు చూసినా అవినీతి ఉంది. దీన్ని ప్రశ్నించడం లేదు. ఆయన మీద వేల కోట్ల స్కామ్స్ కి సంబంధించిన కేసులు ఉన్నాయి.

జగన్, చంద్రబాబు ఎవరూ అంబేడ్కర్ గారి స్ఫూర్తిని కొనసాగించడంలేదు. అంబేడ్కర్ గారికి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేస్తారు తప్ప ఆయన చెప్పిన సమ సమాజ స్థాపనపై దృష్టి లేదు. నేను కుటుంబ పాలన చేసేందుకు రాలేదు. బలమైన భావజాలంతో అందరినీ ఒకటి చేస్తాం. చంద్రన్నకు సెలవిద్ధాం… జగనన్నను పక్కనపెడదాం. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. టీడీపీ పాలన అంతమొందిద్దాం. ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పనికిరాని ఆ 40 ఏళ్ల అనుభవం ఎందుకు? కులాలను విడదీసి పబ్బం గడుపుకొంటున్నారు తప్ప మెరుగైన వైద్యం, విద్య అందించలేని పాలన చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలతో నాతరం నష్టపోయింది చాలు… ఇప్పటి తరాలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. అవినీతిరహితమైన పాలన అందిస్తాం.

• ఆ ఎంపీ వేల కోట్లు ఎగ్గొట్టినా బ్యాంకులు మాట్లాడవా?

మన డ్వాక్రా సంఘం అక్కచెల్లెళ్లకి రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి మరింత అప్పు బరువు పెంచేశారు చంద్రబాబు. రుణం చెల్లించలేక డ్వాక్రా సంఘాల సభ్యురాళ్ళు ఇబ్బందిపడుతున్నారు. బ్యాంక్ అధికారులు నిలదీస్తున్నారు. టీడీపీ ఎంపీ వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టినా బ్యాంక్ అధికారులు ఏమీ మాట్లాడటం లేదు. ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నారా లోకేశ్ గారూ… మా దగ్గర అవినీతి ఎక్కడ ఉంది అంటారు కదా… చూడండి మీ ఎంపీయే వేల కోట్లు దోచేశారు. ఆ కేసు మీదే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఒక పండ్ల వ్యాపారో, పూలు అమ్ముకొనే చిరు వ్యాపారులు వంద రూపాయలు సంపాదించేందుకు రెక్కలుముక్కలు చేసుకోవాల్సి వస్తోంది. ఈ దుర్మార్గులు మాత్రం వేల కోట్ల రూపాయలు దోచుకుపోతున్నారు. రెండు వేలు ఇచ్చే ఓట్లు కొనేసుకుందామనుకొంటున్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. వీళ్ళకు ప్రజలు ఊడిగం చేయాలా?

ముఖ్యమంత్రి మాట్లాడితే సింగపూర్ తరహా అభివృద్ధి అంటారు. అక్కడ ఒక ఎకరా భూమికి వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తారు. మరి ఇక్కడ వేల ఎకరాలు లాగేసుకున్నారు. పట్టుమని పది ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెజ్ ల పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు లాగింది. ఇప్పుడు టీడీపీ కూడా అంతే. ఉద్యోగాలు మాత్రం ఇవ్వడంలేదు. ఆ పార్టీలు, పాలకుల తరఫు వాళ్ల సంపద పెరుగుతోంది. వేల కోట్లు దోచేస్తున్నారు. చంద్రబాబు మన మద్దతు అడిగితే నీతిమంతమైన పాలన ఇవ్వండి అని అడిగాను. ఆయన మాత్రం అవినీతిమంతమైన పాలన చేస్తున్నారు.

• ఉచిత విద్య, ఉచిత వైద్యం

జగన్, చంద్రబాబు, లోకేశ్ ల మాదిరి రూ. 2 వేలు ఇస్తాను, 25 కేజీల బియ్యం ఇస్తాను అని చెప్పను. మీకు 25 ఏళ్ల బంగారు భవిష్యత్ ఇస్తా. ఉచిత వైద్యం, ఉచిత విద్య తీసుకువస్తాను. పిల్లలు బుద్ధిగా పుస్తకాలు పట్టుకొని స్కూల్ కి వస్తే చాలు మంచి విద్య ఇచ్చేలా చేస్తాను. నా పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్ కి వెళ్ళేలా అభివృద్ధి చేస్తాను. నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు అవసరం లేకుండా చేస్తాం. ఆ కార్పొరేట్ సంస్థలు ఫ్యాక్టరీలుగా మారాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు, ర్యాంకులు రాకపోతే చచ్చిపోవాలా? ఐన్ స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్ ఏ నారాయణ, చైతన్యల్లో చదువుకున్నారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రవేత్త వీధి దీపాల కిందే చదువుకున్నారు. ఊపాధ్యాయులకి గౌరవం పెంచి మంచి వేతనాలు ఇస్తాం. వైద్యులకి అవసరమైన అన్ని సదుపాయలు కల్పిస్తాం. మారుమూల ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళేవారికి ఎక్కువ వేతనాలు ఇస్తాం.
ధర్మోరక్షతి రక్షిత అన్న మాట నమ్ముతా. నా మతం ధర్మం, నా కులం రెల్లి. రాజకీయాల్లో చెత్తాచెదారాన్ని ఊడ్చేస్తాం. అవినీతి, దోపిడీ నిందినవాళ్లని పంపించేద్దాం. ప్రజల గురించి ఆలోచించే పార్టీ, నాయకులు రావాలి. అలా ఆలోచించే పార్టీ జనసేన. అలాంటి నాయకుడు పవన్ కల్యాణ్. అలాంటి నాయకులు జనసేనలో ఉన్నారు. 2019లో ముఖ్యమంత్రి అయ్యాకా నేను తప్పు చేసినా నా చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు మీకు ఉంది” అన్నారు.

Exit mobile version