టీఆర్‌ఎస్‌ అధిష్టానంపై రసమయి కూడా తిరుగుబాటు చేయనున్నాడా?

వరుసగా రెండవ సారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంను ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కష్టాలు మొదలయినట్లుగా అనిపిస్తోంది. మొదటి నుండి కూడా అధినేత మాట వేద వాక్కు అన్నట్లుగా ప్రవర్తించిన నాయకులు మరియు కార్యకర్తలు ఆయన్ను కాదనడం, ఆయన మాత్రమే బాస్‌ కాదన్నట్లుగా మాట్లాడటం చేస్తున్నారు. ఇటీవలే మంత్రి ఈటెల రాజేందర్‌ మంత్రి పదవి నాకు ఎవరో భిక్ష వేస్తే రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కష్టపడ్డాను కాబట్టి వచ్చిందన్నాడు.

తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ కూడా ఈ విషయమై స్పందించాడు. నాకు ఈటెల గారికి నిజాలు మాత్రమే మాట్లాడటం వచ్చు. మేమిద్దరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వాళ్లం. అలాంటి మేము అబద్దాలు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఈటెలకు మద్దతు తెలిపాడు. ఈటెలతో రసమయి కలిసి ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈటెలపై టీఆర్‌ఎస్‌ చర్యలకు సిద్దం అయితే పార్టీ రెండుగా చీలడం ఖాయం అనేందుకు ఇదే నిదర్శణం అన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.