కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వ చేసే రంగనాయక సాగర్ ను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రారంభించారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి వచ్చేశాయి. 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు 3 మోటార్లతో కేవలం 3 రోజుల్లోనే నిండనుంది. దీని ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని లక్షా పదివేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అక్కడ నుంచి మల్లన్నసాగర్‌కు, కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు చేరునున్నాయి.
మోటార్లు ప్రారంభించగానే గోదావరి పరవళ్లు చూసి అక్కడున్న వారంతా ఆనందంతో కేకలు వేశారు. వానలు మొదలయ్యే నాటికి కొండపోచమ్మ జలాశయానికి గోదావరి నీటిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. గోదావరి నది నుంచి 500 మీటర్ల ఎత్తున ఉన్న సిద్దిపేట నుంచి సూర్యాపేట వరకు ఉన్న బీడు భూములు తడిపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ కల సాకారం కానుంది. ఇక ఈ కార్య క్రమంలో కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్, ముజమ్మిల్‌ఖాన్, సిద్దిపేట సీపీ జోయల్‌డేవిస్ స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.