• అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు నిషేధిస్తాం
• గిరిజన ప్రాంతాల్లో పనిచేసే టీచర్లు, డాక్టర్లకు రెట్టింపు జీతం
• జగన్, లోకేశ్ మాదిరి నాకు పదవీకాంక్ష లేదు
• 70 ఏళ్లుగా కొన్ని కుటుంబాల మధ్యే రాజకీయాలు నలిగిపోతున్నాయి
• రంపచోడవరం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
అడవితల్లి బిడ్డలకు, గిరిజన గ్రామాలకు న్యాయం జరగాలంటే ఒక్క జనసేన పార్టీ వల్లే సాధ్యమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి గత ప్రభుత్వాలు నిజంగా పాటుపడి ఉంటే జనసేన పార్టీ ఆవిర్భవించేది కాదు… పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదని అన్నారు. కరెంటు లేని గ్రామాలు, బస్సులు లేని ఊళ్లు, ఉపాధి లేని యువతను చూసి కడుపు మండి పల్లె వెలుగు బస్సులో పల్లెబాట పట్టానన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా రంపచోడవరంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు వేలాదిమంది జనసైనికులతో పాటు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు కూడా హాజరయ్యారు. ఈ సభ వేదిక నుంచి శ్రీ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
“మైనింగ్ పేరుతో అడవితల్లి గర్భాన్ని తవ్వేస్తూ మన పరిసరాలను, జలాలను కలుషితం చేస్తుంటే బాధరాదా..? కన్నీళ్లు రావా..? దీనిపై ఎవరూ మాట్లాడరు. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు గిరిజన ప్రాంతాలకు వచ్చి ధైర్యంగా ఎందుకు పర్యటించలేరు. ఎందుకంటే ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోపిడి చేసే వాళ్లకు అడవిలో తిరిగే దమ్ము, ధైర్యం ఉండవు కాబట్టి. అందుకే వాళ్లు ఇటు వైపు రారు, కనిపించరు, మాట్లాడరు. కానీ బిర్యానీ, మద్యం ఇచ్చి మన ఓట్లను కొనేయచ్చు అనుకుంటున్నారు. కానీ ఆ తరం అయిపోయింది. ఇప్పుడు వీరతిలకం దిద్దే ఆడపడుచులున్న జనసైనికుల తరం వచ్చింది. ప్రకృతి వనరులు దోచుకుంటే తాటతీస్తారు. అడవి తల్లి, ప్రకృతిని గౌరవించే వ్యక్తిని కాబట్టే ప్రకృతిని కాపాడే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని పార్టీ సిద్ధాంతాల్లో పెట్టాను.
• ఆ రోజు స్పందిస్తే ఎమ్మెల్యే బతికేవాడు
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా అవినీతి రాజ్యమేలుతోంది. పరిష్కారం వస్తుంది అంటే తుపాకులు పట్టి అడవుల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం. కానీ మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం చాలా గొప్పవి. వాటిని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయాల్సిన ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి వాటాలు వేసుకుని దోపిడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను ఛిద్రం చేస్తున్నారు. ఈ రోజు జనసేన పార్టీ లేకుండా ఉంటే ఉద్ధానం, రైతులు, వికలాంగుల సమస్యలు బయటకు వచ్చేవి కాదు. అరకులో పర్మిషన్లు లేకుండా క్వారీలను తవ్వేస్తున్నారు. బాంబులు పెట్టి కొండలను పిండి చేస్తున్నారు. నీటి వనరులను కలుషితం చేస్తున్నారు. ఆ నీటిని తాగిన గిరిజనులు కిడ్నీ వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు. నేను దీనిపై నిలదీసిన రోజున ప్రభుత్వం స్పందించి ఉంటే గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయేవాడు కాదు. ఎంతకాలం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని గిరిజనులను అణిచివేస్తారు. ప్రభుత్వ విధానాలకు పోలీసులు కూడా నలిగిపోతున్నారు. ప్రభుత్వాలు అవినీతిరహిత పాలనే అందిస్తే ఈ రోజు ఇంతమంది అడవిలోకి వెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. రాజకీయ పార్టీ నడపాలన్న, ముఖ్యమంత్రి అవ్వాలన్నఅనుభవం కావాలి. ఆంధ్రప్రదేశ్ లో అనుభవం ఉన్నవ్యక్తి చంద్రబాబుగారని నమ్మి ఏమీ ఆశించకుండా 2014లో మద్దతు ఇచ్చాను. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. రాజధానిలేని రాష్ట్రానికి న్యాయం చేస్తారు అని నమ్మాను. అయితే – ఆయన హైదరాబాద్ లో ఎలాంటి దోపిడి విధానాలు అమలు చేశారో అమరావతిలో కూడా అదే చేస్తుంటే కడుపుమండి ఎదురు తిరిగాను తప్ప సడన్ గా ఎదురు తిరగలేదు. సడన్ గా ఎదురు తిరిగితే ఎన్ని ఇబ్బందులుపెడతారో నాకు తెలియదా,.? ఎన్ని రకాలుగా బద్నామ్ చేస్తారో నాకు తెలియదా..? వీళ్లను ఎదిరించడానికి మన దగ్గర డబ్బులు, గుండాలు, బలమైన మీడియా వ్యవస్థ లేదు. మనకు ఉన్నది కేవలం జనసైనికులు, నా భావజాలాన్ని అర్ధం చేసుకునే కామ్రేడ్స్ మాత్రమే.
• పిడుగుల్లాంటి జనసైనికులను నమ్మి…
ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిలా పదవీకాంక్ష లేదు. మంత్రి లోకేశ్ లాగా దొడ్డిదారిన వచ్చిన వాడిని కాదు. వేలకోట్లు డబ్బులు నమ్మో, వందలాది మంది గుండాలు నమ్మో రాజకీయాల్లోకి రాలేదు. ధర్మాన్ని రక్షించే పిడుగుల్లాంటి జనసైనికులు నమ్మి రాజకీయాల్లోకి వచ్చాను. పంచాయితీ ప్రెసిడెంట్ గా పోటీ చేయని వ్యక్తి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి. ఆయన మనల్ని పాలించేది. గిరిజన ప్రాంతాల్లో ఒక టీచర్ కు ఉన్న జ్ఞానం మంత్రి లోకేశ్ గారికి ఉందా..? అడవి తల్లి బిడ్డల ఆక్రోశం ఆయనకు తెలుసా..? ఒక రోజు పల్లెబాట పట్టగలరా..? ఇలాంటి బస్సుల్లో ప్రయాణించగలరా..? నడవగలరా..? మరి ఇలాంటి వాళ్లు మనకు నాయకులుగా ఎందుకు.
మన ఓట్లతో గెలిచి, మనపై పెత్తనం చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వారు చేసిన తప్పుడు విధానాల వల్ల ఆంధ్రులను తెలంగాణ నాయకులు దోపిడి దారులుగా చిత్రికరించారు. వారిని ఎదిరించే ధైర్యం ఆనాడు మంత్రి లోకేశ్, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గానీ లేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని వదులుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి పారిపోయి వచ్చారు. ఆనాడు తెలంగాణ నాయకులు తిడుతుంటే ప్రజలను, పాలకులను వేరు చేయండి అని చెప్పిన ఏకైక పార్టీ జనసేన పార్టీ .
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చూసినప్పుడల్లా ఒకటే గుర్తుకు వస్తుంది. నేను 25 కేజీల బియ్యం ఇవ్వడానికి రాలేదు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చా. 60 ఏళ్ల ముసలి వయసులో రాజకీయాల్లోకి రాలేదు. మూడు పదుల వయసులోనే వచ్చా. వయసు, శక్తి ఉండగానే రాజకీయాల్లో మార్పు తేవాలని వచ్చా. అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం మీ చేతికి ఇచ్చారు. అవినీతి కోటలు బద్దలు కొట్టడానికి, నీతివంతమైన పాలన సాదించడానికీ మీకు ఇచ్చిన ఆయుధం అది. సద్వినియోగ పర్చుకోవడమా చేజార్చుకోవడమా అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఒక వైపు జనసేన, ఇంకో వైపు వైసీపీ, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నాలుగు దశాబ్దాల అనుభవం అని చెప్పే ముఖ్యమంత్రిగారు మరోవైపు ఉన్నారు. మీకు ఆ ఇద్దరు కావాలా, ఒక్క ఎంపి, ఎమ్మెల్యే లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీ కావాలా.? తేల్చుకోండి జగన్మోహన్‌రెడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా లేక జనసేన పార్టీ పవన్‌కళ్యాణా ఛాయిస్ మీదే. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి.. గూండాలు ఆడబిడ్డల జోలికి వస్తే తోలుతీసే పాలన తెస్తాం. ఏసీబీకి పనిలేని పరిస్థితులు తెస్తాం. మారుమూల గిరిజన ప్రాంతాలకి విద్య, వైద్యంతోపాటు సకల సదుపాయాలు కల్పించే ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.
• నిధులు ఖర్చు చేయరు… అడిగేవాళ్లు లేరు
70 ఏళ్లుగా కొన్ని కుటుంబాలు, వ్యక్తుల మధ్య రాజకీయాలు నలిగిపోతున్నాయి. ఇది చూసి విసుగొచ్చి ఇచ్ఛాపురం నుంచి పోరాటయాత్రను మొదలుపెట్టాను. అరకులో ఎలాంటి పరిస్థితులు చూశానో, ఇవాళ సుద్దగొమ్ము గ్రామంలో అదే పరిస్థితులు చూశాను, తాగటానికి స్వచ్ఛమైన నీరు లేక కలుషితమైన నీళ్లు తాగుతూ గిరిజనులు కలరా బారిన పడుతున్నారు. చిన్న చెట్టు కొడితే గిరిజనులపై కేసులు పెట్టి జైల్లో పెడతారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనాలను పచ్చి బూతులు తిట్టినా, వారి మనుషులు అడ్డగోలుగా అక్రమ మైనింగ్ చేసినా వాళ్లపై కేసులు పెట్టరు. అన్యాయం జరిగినప్పుడు ప్రజాపోరాటాలు పుట్టుకొస్తాయి. అలాంటి ప్రజాపోరాటంలో ఎన్ కౌంటర్లు బాధ కలిగిస్తాయి. ఎక్కడికి వెళ్లినా పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల అరాచకాలు ఎక్కువైపోయాయని ప్రజలు తిడతారు. కానీ అది తప్పు. వారి చేతిలో అధికారం లేదు. అధికారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ చేతిలో ఉండిపోయింది. వారు చేసిన తప్పుడు పాలసీలకు అధికారులు ఏం చేస్తారు. మైనింగ్ చేయాలంటే ముఖ్యమంత్రి, వాళ్ల కేబినెట్ నిర్ణయం తీసుకుంటారు తప్ప డిజీపీ, ఐజీలు కాదు.
గిరిజన సంక్షేమానికి ఈ జిల్లాలో రూ. 28 కోట్లు విడుదల అయితే ఖర్చు చేసింది రూ. 8 కోట్లు మాత్రమే. దీనిపై అడిగేవాడు లేడు. ఉన్న ఎమ్మెల్యేలు చంద్రబాబు, జగన్ కు తొత్తులుగా మారిపోవడంతో గిరిజనులకు న్యాయం జరగలేదు. గిరిజనులకు అండగా నిలబడే నాయకత్వం కావాలని నమ్మి మాజీమంత్రి బాలరాజుగారిని పార్టీలోకి ఆహ్వానించాను. గిరిజనులకు సంబంధించి ప్రత్యేక పాలసీని తీసుకొస్తాం. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య వ్యవస్థని బలంగా తయారు చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే టీచర్లకి, వైద్యులకి రెట్టింపు జీతాలు ఇస్తాం. చక్కటి విద్యా వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. ఏ అడవితల్లి కన్నీరు పెట్టని పరిస్థితుల్ని జనసేన ప్రభుత్వం కల్పిస్తుంద”ని హామీ ఇచ్చారు.