భారత్ – ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అయితే రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం విశాఖ వన్డేకు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముంది. ఉపరితలద్రోణి కారణంగా రెండురోజులుగా పలు చోట్లు వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఆదివారం వర్షం పడే అవకాశముండడంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో భారత్, ఆసీస్ వన్డే సమరం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
కాగా ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఇక టిక్కెట్లన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇకపోతే విశాఖలో దాదాపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న వన్డేకు వరుణుడు అడ్డుపడకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ కూడా వర్షం కురిసే అవకాశాలు 80శాతం వరకూ ఉన్నాయి. ఏకధాటిగా వర్షం పడే అవకాశాలు లేవని మాత్రం తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే మ్యాచ్ ఓవర్లను కుదించే పరిస్థితి రావొచ్చు. అయితే వర్షం పడినా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో తక్కువ సమయంలోనే గ్రౌండ్ ను సిద్దం చేసే అవకాశాలు కూడా వున్నాయి.