ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీల్లో రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మూడు విడతలుగా 35 చిట్ ఫండ్ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టు రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. వీటిలో 18 మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. తమ తనిఖీలో పలు అవకతవకలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం బ్రాంచ్‌లో 28 చిట్స్‌లో అక్రమాలను గుర్తించామన్నారు. 2 కోట్ల 88 లక్షల మేరకు జరిపిన చెల్లింపులకు మార్గదర్శి సిబ్బంది ఆధారాలు చూపలేదని తెలిపారు. అదేవిధంగా విజయనగరంలో 12 చిట్‌లను పరిశీలించగా, 54 లక్షల 85 వేల చెల్లింపులకు సైతం ఆధారాలు చూపించలేదని వివరించారు.