అధికారిక బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ !


పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడటంతో రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు అయింది.నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడిన సభ్యులు అధికారక నివాసాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‭లోని అధికారక భవనాన్ని ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. దీంతో రాహుల్ నేడు బంగ్లాను ఖాళీ చేసారు. ఇకపోతే ఢిల్లీ ప్ర‌భుత్వ బంగ్లాలో 2005 నుంచి రాహుల్ ఉంటున్నారు. ఇక ఇటీవలే రాహుల్ తనకు సంబంధించిన వస్తువలన్నింటిని సోనియా గాంధీ నివాసానికి తరలించారు. ఈక్రమంలో మిగిలిన వస్తువులను కూడా ఈరోజు తీసుకొని వెళ్తూ.. ఇంటి తాళాలను లోక్ సభ సెక్రటేరియట్ కు అప్పగించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఈ దేశ ప్రజలు నన్ను ఎన్నుకొని 19 ఏళ్ల పాటు ఆ బంగ్లాలో ఉండే అవకాశం ఇచ్చారని.. వారందరికి ధన్యవాదాలు అని అన్నారు. నిజం మాట్లాడినందుకు మూల్యం చెల్లించుకుంటున్నానని.. నిజం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు తాను రెడీగా ఉన్నానని’ చెప్పుకొచ్చారు. ఇకపై రాహుల్ జనపథ్ లో తన తల్లితో ఉండనున్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు మద్ధతుగా #MeraGharAapkaGhar(నా ఇల్లే మీ ఇల్లు) అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.