తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ జీరో

rahul
తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర జీరో అన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. తెలంగాణ కోసం టీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేసిందని రాహుల్ తెలిపారు. టీబిల్లు రూపకల్పనలో సైతం టీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. వరంగల్ లో బహిరంగ సభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణను బీజేపీ, టీడీపీలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని అన్నారు. జూన్ 2న తెలంగాణ ప్రజల కల సాకారం కాబోతోందని చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాపై ఎనలేని ప్రేమ చూపి వరాల జల్లు కురిపించారు. వరంగల్ ను రాష్ట్రంలో రెండో అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఐటీ పార్కును వరంగల్ లో నిర్మించాలనుకున్నట్టు తెలిపారు. అలాగే టెక్స్ టైల్ పార్కును కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. 150 కోట్ల రూపాయలతో ఎయిమ్స్ స్థాయి మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే భూపాలపల్లి పరిసరాల్లో 800 మెగావాట్ల విద్యుత్కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ తరువాత మరో ఐటీ నగరంగా వరంగల్ ను తయారు చేస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు.